Visakhapatnam: అక్టోబర్ లో విశాఖ నుంచి పాలన లేనట్టే?

చాలా రోజులుగా విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీసును ప్రారంభించడానికి జగన్ కసరత్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పలానా రోజు విశాఖ నుంచి పాలన ప్రారంభిస్తానని ఒకటి రెండుసార్లు వెల్లడించారు.

Written By: Dharma, Updated On : October 14, 2023 4:03 pm

Visakhapatnam

Follow us on

Visakhapatnam: విశాఖ నుంచి పాలన ప్రారంభించే ముహూర్తం మారింది. విజయదశమి నుంచి పాలన ప్రారంభించనున్నట్లు జగన్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ ముహూర్తం వచ్చే నెలకు వాయిదా పడినట్టు సమాచారం. అధికారుల కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి ముహూర్తాన్ని ఖరారు చేయనున్నారు. దీంతో విశాఖ నుంచి పాలన ప్రారంభం జాబితాలో ఈ విజయదశమి చేరిపోయింది. ఇప్పటివరకు చాలాసార్లు, చాలా ముహూర్తాలను ప్రకటించారు. కానీ విశాఖ నుంచి పాలనను ప్రారంభించలేకపోయారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదివరకు ప్రకటించిన అమరావతిని శాసన రాజధానిగా పరిమితం చేసి.. విశాఖను పాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించారు. కానీ గత మూడు సంవత్సరాలుగా ఎటువంటి ముందడుగు వేయలేకపోయారు. అత్యున్నత న్యాయస్థానంలో కేసు పెండింగ్లో ఉండడంతో రాజధానులపై నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఓ ఆలోచన చేశారు. విశాఖ నుంచి పాలన ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. కానీ దీనికి సైతం తాత్కాలిక అడ్డంకులు ఎదురవుతున్నాయి. విశాఖ నుంచి పాలన నవంబర్ కు వాయిదా పడినట్లు సమాచారం.

చాలా రోజులుగా విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీసును ప్రారంభించడానికి జగన్ కసరత్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పలానా రోజు విశాఖ నుంచి పాలన ప్రారంభిస్తానని ఒకటి రెండుసార్లు వెల్లడించారు. కొద్దిరోజుల కిందట విజయదశమి నుంచి పాలన ప్రారంభమవుతుందని సంకేతాలు ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే విశాఖలో అన్ని ఏర్పాట్లు జరుగుతుండడంతో విజయదశమి నుంచి పక్కా అన్న అంచనాకు అందరూ వచ్చారు. అయితే తాజాగా ఈ ముహూర్తం సైతం వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్చార్జ్ వైవి సుబ్బారెడ్డి కీలక విషయాలను వెల్లడించారు. సీఎం జగన్ అక్టోబర్ లేద నవంబర్లో విశాఖకు వస్తారని చెప్పుకొచ్చారు. సీఎంతో పాటుగా వచ్చే అధికారులకు విశాఖలో వసతులు సమకూర్చాల్సి ఉందని చెప్పారు. వీటి కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసిన విషయాన్ని వెల్లడించారు. ఈ కమిటీ అన్ని పరిశీలించి.. పూర్తిస్థాయిలో నివేదిక ఇస్తుందని వివరించారు. కమిటీ చేసే సూచనలకు అనుగుణంగా పనులు ప్రారంభమవుతాయని సుబ్బారెడ్డి వివరించారు.

మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎన్నికల వ్యూహరచనలో జగన్ నిమగ్నమయ్యారు. పార్టీ క్యాడర్ను అన్ని విధాలా సిద్ధం చేస్తున్నారు. కొద్దిరోజుల కిందటే పార్టీ శ్రేణులతో విజయవాడలో సమావేశమయ్యారు. 26 నుంచి బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. ఒకవైపు పార్టీ పై దృష్టి పెడుతూనే… కీలకమైన విశాఖ పాలనను ప్రారంభించడానికి జగన్ కసరత్తు చేస్తున్నారు. వీలైనంతవరకు పార్టీకే ఎక్కువ సమయం కేటాయించాలని భావిస్తున్నారు. అందుకే విశాఖ నుంచి పాలన ప్రారంభ తేదీని ఒక నెలపాటు వాయిదా వేసినట్లు సమాచారం.