https://oktelugu.com/

షర్మిల పార్టీతో జగన్‌కు మరిన్ని విభేదాలు వచ్చినట్లేనా..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు వైఎస్‌ రాజశేఖర్‌‌రెడ్డి. ఆయన మరణానంతరం జరిగిన రాజకీయ పరిణామాలు అందరికీ తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఆయన తనయుడే జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. వైఎస్ఆర్‌‌ ముద్దుల తనయ అయిన షర్మిల రేపో ఎల్లుండో తెలంగాణలో పార్టీ స్థాపించబోతున్నారు. ఇద్దరూ ఆ రాజన్న బిడ్డలే. ఇద్దరూ ఫైనల్‌గా రాజన్న రాజ్యమే లక్ష్యమంటున్నారు. జగన్ ఆంధ్రా ముఖ్యమంత్రిగా తన మార్క్‌ పాలనతో ఇప్పటికే రాజన్న రాజ్యాన్ని చూపిస్తున్నారు. షర్మిలమ్మ తెలంగాణలో తానూ […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 23, 2021 / 01:01 PM IST
    Follow us on


    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు వైఎస్‌ రాజశేఖర్‌‌రెడ్డి. ఆయన మరణానంతరం జరిగిన రాజకీయ పరిణామాలు అందరికీ తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఆయన తనయుడే జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. వైఎస్ఆర్‌‌ ముద్దుల తనయ అయిన షర్మిల రేపో ఎల్లుండో తెలంగాణలో పార్టీ స్థాపించబోతున్నారు. ఇద్దరూ ఆ రాజన్న బిడ్డలే. ఇద్దరూ ఫైనల్‌గా రాజన్న రాజ్యమే లక్ష్యమంటున్నారు. జగన్ ఆంధ్రా ముఖ్యమంత్రిగా తన మార్క్‌ పాలనతో ఇప్పటికే రాజన్న రాజ్యాన్ని చూపిస్తున్నారు. షర్మిలమ్మ తెలంగాణలో తానూ రాజన్నరాజ్యం తెస్తానని సిద్ధమవుతున్నారు.

    Also Read: మున్సిపల్‌ పోరు.. రాజకీయాల్లో మార్పులు..

    రేపు తెలంగాణలో షర్మిలమ్మ పార్టీ పెడితే ఆ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు ఎంతవరకైనా తెగించవలసి ఉంటుంది. లేకుంటే ఆమెకే కాదు- ఏ పార్టీకైనా ఉనికి ఉండదు. ఇక్కడే అన్నాచెల్లెళ్ల మధ్య రాజకీయ స్పర్థలు ప్రారంభం కావడం తథ్యం. ఒకవేళ ఇద్దరూ సంయమనం పాటించినా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర పార్టీలు వారిని రెక్కబట్టి ముగ్గులోకి లాగక తప్పవు. షర్మిలమ్మ పార్టీ పెట్టేందుకు సన్నాహాలు మొదలుపెట్టగానే ఒకవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీ జగనన్న వదిలిన బాణం కాదని, కేసీఆర్ వదిలిన బాణమని వ్యాఖ్యానాలు చేశారు. షర్మిలమ్మ పార్టీ పెడితే తమకు చెందిన ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతాయని అంతిమంగా కేసీఆర్ లాభపడతారనే భయంతో బీజేపీ, కాంగ్రెస్ నేతలు షర్మిలమ్మపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కేసీఆర్‌కు లాభం చేకూర్చేందుకు జగన్ ప్రోద్బలంతోనే షర్మిలమ్మ పార్టీ పెడుతున్నారని వాదించేవారు కూడా లేకపోలేదు. మరి ముఖ్యమంత్రి జగన్ ఎందుకు బెంబేలెత్తుతున్నారో వీరి నుంచి సమాధానం లేదు.

    షర్మిలమ్మ పార్టీ పెడితే తెలంగాణలో ఎవరెవరికి ఏ మేరకు నష్టం జరుగుతుందో ఏమోగానీ, ఈలోపే జగన్, షర్మిలమ్మ ఇరువురూ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజన్నరాజ్యం ఏర్పాటు చేయబోయి అంతిమంగా వైఎస్ ప్రాభవాన్ని మసకబారేట్టు చేస్తారా అనే అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన నాటి సమస్యలు పరిష్కారం కాలేదు. ప్రధానంగా సాగునీటి రంగంలో తెలంగాణతో ఏర్పడిన వివాదంలో రాష్ట్రంలో ఇతర ప్రాంతాల కన్నా రాయలసీమ ఎక్కువ నష్టపోతోంది. తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలతో సీమ ప్రజల చిరకాల వాంఛితమైన సిద్ధేశ్వరం అలుగు, గుండ్రేవుల రిజర్వాయర్, పోతురెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులు ముందుకు సాగడం లేదు. అదే సమయంలో తెలంగాణ నిర్మిస్తున్న పాలమూరు–రంగారెడ్డి దిండి, మరికొన్ని పథకాల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది.

    Also Read: తెలుగు రాష్ట్రాల్లో రికార్డు సృష్టించనున్న షర్మిల?

    ఇలాంటి నేపథ్యంలో షర్మిలమ్మ ఈ అంశంలో ఏపీ వ్యతిరేక వైఖరి తీసుకోకుండా రాజకీయం ఎలా నడిపించగలదు..? ఒకవేళ షర్మిలమ్మ తెలంగాణ ప్రజల ప్రయోజనాల పక్షాన గళం విప్పితే వైఎస్ రాజశేఖర్‌‌ రెడ్డి పరపతి ఏం కాబోతుంది..? రాయలసీమ వాసులకు జగన్ ఏమని సమాధానం చెబుతారు..? పోలవరం 150 అడుగుల ఎత్తున నిర్మాణం జరిగితే భద్రాచలం మునిగిపోతుందని టీఆర్‌ఎస్‌తోపాటు కాంగ్రెస్, బీజేపీ, అన్ని పార్టీల నేతలు గోల చేస్తున్నారు. ఈ ఒత్తిడిని షర్మిలమ్మ ఏ మేరకు తట్టుకొని నిలువగలదు..? వారితో గొంతు కలిపితే ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెబుతారు..? ఇవన్నీ ప్రశ్నలే. ఒకవేళ వివాదాంశాల్లో షర్మిలమ్మ మౌనం పాటిస్తే- అప్పుడు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలే గాక, అసలుకే మోసం వస్తే సెంటిమెంటు రాజకీయాలతో నెట్టుకువస్తున్న కేసీఆర్ షర్మిలమ్మను ఏపీకి వ్యతిరేకంగా ముగ్గులోకి లాగకుండా ఉంటారా? ఇదే జరిగితే ఏపీలోనూ ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి జగన్‌కు పొగబెట్టకుండా ఉంటాయా..? వీటన్నింటి నేపథ్యంలో భవిష్యత్‌ రాజకీయాలు మరింత ఆసక్తిని తలపిస్తున్నాయి. ఒకవేళ తెలంగాణ విషయంలో తన విధానాలను ప్రకటించాల్సి వస్తే.. ఆ నిర్ణయాలు అక్కడ అన్న జగన్‌కు వ్యతిరేకంగా మారే ప్రమాదాలూ లేకపోలేదు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్