కరోనా సెకండ్ వేవ్ ఉధృతిని చూసి దేశం మొత్తం తీవ్ర భయాందోళనకు గురవుతోంది. సౌకర్యాల కొరతతో రోగులు అల్లాడిపోతున్నారు. ఊపిరి అందక వేలాది మంది చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ.. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో తాజాగా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాట్లాడిన మాటలు.. దేశం మొత్తాన్ని కలచి వేశాయి. మహా విలయం కొనసాగుతున్న వేళ.. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మిగిలిపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. ఢిల్లీ పరిస్థితిని వివరిస్తూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
ఢిల్లీలో ఆక్సీజన్ ఉత్పత్తి కేంద్రాలు లేవని చెప్పిన కేజ్రీవాల్.. తమకు ఆక్సీజన్ ఇవ్వరా? అని ప్రశ్నించారు. ఆసుపత్రుల్లో రోగులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. ఆక్సీజన్ అందుబాటులో లేదని చెప్పిన కేజ్రీవాల్.. ఈ విషయం గురించి తాను ఎవరితో మాట్లాడాలో చెప్పాలని నరేంద్ర మోడీని ప్రశ్నించినట్టు సమాచారం.
కొవిడ్ బారిన పడ్డవారు సరైన వైద్యం అందక చేస్తున్న ఆర్తనాలను తలుచుకుంటే.. రాత్రిళ్లు నిద్ర పట్టట్లేదని సీఎం ఆవేదన వ్యక్తంచేశారు. తాను ముఖ్యమంత్రి అయినప్పటికీ.. ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నానని భావోద్వేగానికి గురయ్యారు. అవాంఛనీయ సంఘటనలు జరిగితే.. తనను ప్రజలంతా క్షమించాలని కేజ్రీవాల్ కోరడం ఆయన నిస్సహాయ స్థితిని తెలియజేసింది.
దీంతో.. అందరి చూపు నరేంద్ర మోడీపైనే నిలిచింది. కేజ్రీవాల్ ఆవేదన ఎంత వరకు కదిలించింది? కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాలి.