Arvind Kejriwal : జైలు నుంచి విడుదలైన తర్వాత అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి కొద్ది రోజుల్లో ఢిల్లీ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో.. అనేక ఆయుధాలను ఆయన రెడీ చేసుకుంటున్నారు. తాను రెండు రోజుల్లో రాజీనామా చేస్తానని ఆదివారం ప్రకటించి దేశ రాజకీయాలలో కలకలం రేపారు.. ఢిల్లీ మద్యం విధానంలో అవకతవకలు చోటుచేసుకున్నాయనే అభియోగాల నేపథ్యంలో ఆయన అరెస్టయ్యారు. అయితే తనపై పడ్డ అవినీతి మరకను తుడుచుకునేందుకు అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. తన నిజాయితీని నిరూపించుకునేందుకు అరవింద్ ఈ ప్రకటన చేసినట్టు సమాచారం. ప్రజల తీర్పు తనకు అనుకూలంగా ఉండే వరకు ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటారని అరవింద్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. రాజీనామా అస్త్రం ద్వారా ఆయన ఎలాంటి అడుగులు వెయ్యబోతారనేది ఉత్కంఠ గా మారింది. జైల్లో ఉన్నప్పుడు అరవింద్ కేజ్రీవాల్ పదవికి రాజీనామా చేయలేదు. జైలు నుంచి విడుదల తర్వాత ఆయన ఈ ప్రకటన చేయడం సంచలనంగా మారింది.
రాజీనామా తర్వాత..
రాజీనామా తర్వాత ఆయన ముందస్తు ఎన్నికలు వస్తాయని అంచనా వేస్తున్నారా? లేదా మరొకరిని తన స్థానంలో కూర్చోబెడతారా? అనే ప్రశ్నలకు స్పష్టత లేదు. ఒకవేళ ఎన్నికలు జరిగే సమయం వరకు ముఖ్యమంత్రి స్థానంలో ఎవరిని కూర్చోబెడతారనేది ఆసక్తికరంగా మారింది.. రాజీనామా ప్రకటనతో ముందస్తు ఎన్నికలకు అరవింద్ కేజ్రివాల్ సిద్ధపడ్డారా? అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తింది. అయితే పదవీకాలం మిగిలి ఉండగానే ప్రభుత్వాన్ని రద్దు చేయడం వల్ల ఉపయోగముండదని అరవింద్ కేజ్రీవాల్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.. అయితే రాజీనామా ప్రకటన చేసిన తర్వాత కొంత సమయానికే ఢిల్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ అరవింద్ కేజ్రీవాల్ ను కలవడం.. చాలాసేపు మాట్లాడటం చర్చకు దారి తీసింది. ఆ తర్వాత రామ్ నివాస్ విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వాన్ని రద్దు చేసే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. పదవి కాలం ఉన్నంతవరకు తమ ప్రభుత్వం కొనసాగుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ పూర్తి సమయాన్ని ఎన్నికల ప్రచారం కేటాయిస్తారని వివరించారు.
తదుపరి ఎన్నికల్లో గెలిచేందుకేనా..
అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసి.. తదుపరి ఎన్నికల్లో గెలిచేందుకే అడుగులు వేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే దీనిపై ఆప్ నేతలు ఇంతవరకూ స్పందించలేదు. ” మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. జైలుకు వెళ్లి వచ్చారు. ఆయన పార్టీ పంజాబ్ రాష్ట్రంలో అధికారంలో ఉంది. హర్యానాలో అధికారాన్ని దక్కించుకోవాలని భావిస్తోంది. ఇలాంటి సమయంలో ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టాలి. అందుకు అనుగుణంగా ఆయన రాజీనామా అస్త్రాన్ని వదిలారు. దీనివల్ల ఎంత మేర లాభపడతారో వేచి చూడాల్సి ఉందని” రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Arvind kejriwal announces resignation as delhi cm after exit from tihar jail
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com