Bhadrachalam Governor: రాష్ర్ట గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు అవమానాలే ఎదురవుతున్నాయి. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు అధికార పార్టీ టీఆర్ఎస్ గవర్నర్ తమిళిసై మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన గవర్నర్ కు అడుగడుగునా అవమానాలే కనిపిస్తున్నాయి. ఆమె పర్యటనకు హెలికాప్టర్ సమకూర్చాల్సిన ప్రభుత్వం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. దీంతో ఆమె రైలు, రోడ్డు మార్గాల ద్వారా భద్రాచలం వెళ్లి శ్రీరాముల కల్యాణంలో పాల్గొనడానికి వెళ్లినట్లు తెలుస్తోంది.

అక్కడ ఆమెకు ప్రొటోకాల్ ప్రకారం జిల్లా కలెక్టర్, ఎస్పీ స్వాగతం పలకాల్సి ఉండగా వారు అందుబాటులో లేరు. ఏమంటే సెలవులో ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో ఆమె మరింత నైరాశ్యంలో పడింది. రాష్ట్రానికి గవర్నర్ గా ఉండే సమయంలోనే ఇంత దారుణంగా వ్యవహరించడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ పర్యటనలో ప్రొటోకాల్ పాటించకుండా సెలవుపై వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో భద్రాద్రి రామచంద్రస్వామి సాక్షిగా గవర్నర్ కు జరిగిన అవమానం గురించి తమిళిసై విచారం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యత గల పదవిలో ఉన్నా కావాలనే దురుద్దేశంతో కుంటిసాకులు చెబుతూ బాధ్యతల నుంచి తప్పుకోవడంపై సర్కారు తగిన మూల్యం చెల్లించడం ఖాయమనే తెలుస్తోంది. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు గా టీఆర్ఎస్ కు ఇక రోజులు దగ్గర పడినట్లే అనే వాదనలు కూడా వస్తున్నాయి.
దేశ చరిత్రలోనే గవర్నర్ రైలు, రోడ్డు మార్గాల గుండా వచ్చిన సంఘటనలు లేవు. కానీ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ ను కావాలనే టార్గెట్ చేసుకున్నట్లుు స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఆమె టీఆర్ఎస్ పై తన అక్కసు తీర్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీ వేదికగా ఫిర్యాదు చేయడంతో ఇక చర్యలే మిగిలాయనే చర్చ సాగుతోంది. భవిష్యత్ లో టీఆర్ఎస్ కు ఇక చుక్కలే అనే అభిప్రాయాలు కూడా వస్తున్నాయి.