AP New Ministers: ఆంధ్రప్రదేశ్‌లో గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్త మంత్రులు కొలువుదీరారు. వెలగపూడిలోని సచివాలయం మొదటి బ్లాక్ పక్కన మంత్రులు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అక్షర క్రమంలో కొత్త మంత్రుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ చదివారు. ఆ ప్రకారం వారితో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. తొలుత అంబటి రాంబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త మంత్రివర్గంలో 11 మంది పాత వారికి మరోమారు అవకాశం కల్పించారు. కొత్తగా 14 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, విశ్వరూప్, గుమ్మనూరి జయరాం, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, నారాయణస్వామి, అంజాద్ బాషా, ఆదిమూలపు సురేష్‌ను మరోమారు సీఎం జగన్ కేబినెట్‌లో అవకాశం కల్పించారు.
కొత్తగా.. ధర్మాన ప్రసాదరావు, రాజన్న దొర, గుడివాడ అమర్‌నాథ్, ముత్యాలనాయుడు, దాడిశెట్టి రాజా, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, జోగి రమేష్, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, విడదల రజని, కాకాణి గోవర్ధన రెడ్డి, ఆర్కే రోజా, ఉషా శ్రీచరణ్‌కు మంత్రి పదవులు ఇచ్చారు.
Also Read: వారి వ్యవహార శైలే పదవులు వచ్చేలా చేసిందా?
ఏపీ కొత్త మంత్రులు సీఎం జగన్ పట్ల తమ విధేయత చాటుకున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి వద్దకి వెళ్లి కాళ్లకు నమస్కరించుకున్నారు. కొందరు గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్ కు నమస్కరించి వెళ్లిపోగా.. మరొకొందరు మంత్రులు జగన్ కాళ్లపై పడ్డారు. మంత్రి నారాయణ స్వామి, ఉష శ్రీచరణ్ జగన్ కాళ్లకు తాకి నమస్కారం చేశారు. గుడివాడ అమర్ నాథ్, జోగి రమేశ్ మోకాళ్ల మీద వంగి మరీ కాళ్లకు నమస్కరించారు. మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత ఆర్కే రోజా జగన్ వద్దకు వెళ్లి కాళ్లకు నమస్కరించారు. అనంతరం జగన్ చేతిని ముద్దాడారు.
Also Read: ఏపీ కొత్త మంత్రులకు కేటాయించిన శాఖలు.. రోజా హోం మినిస్టర్ కాదు.. ఏ శాఖంటే?