Credit Cards : క్రెడిట్ కార్డ్… డబ్బులు లేని సమయంలో కొనుగోళ్లు చేసేందుకు ఉపయోగపడే ఆర్థిక సాధనం. అంతేకాదు.. క్రెడిట్ కార్డుల ద్వారా రివార్డులు, ఇతర ప్రయోజనాలను పొందుతారు. క్రెడిట్ కార్డ్‌లను సరిగ్గా ఉపయోగించుకుంటే వాటి ద్వారా వచ్చే లాభాలు అన్నీ ఇన్నీ కావు. క్రెడిట్ కార్డుల సక్రమ వాడకం వల్ల బలమైన క్రెడిట్ స్కోర్‌ను నిర్మించుకోవచ్చు. తద్వారా భవిష్యత్తులో లోన్‌కు సంబంధించి మంచి మంచి ఆఫర్లను కూడా పొందవచ్చు. అయితే, క్రెడిట్ కార్డులను నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా ఏమాత్రం భయం లేకుండా వాడితే మాత్రం అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకుందాం.
ఇటీవలి కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం విపరీతంగా పెరిగిపోయంది. ఈ నేపథ్యంలో బ్యాంకులు, నాన్ ఫైనాన్స్ కంపెనీలు కూడా ప్రజల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని.. ఎక్కువ లిమిట్ తో క్రెడిట్ కార్డులను అందజేస్తున్నాయి. అయితే క్రెడిట్ కార్డు ఉంది కదా అని ఎక్కడపడితే అక్కడ వాడితే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. క్రెడిట్ కార్డులతో ఎన్ని ఉపయోగాలు ఉంటాయో అలాగే.. అన్ని నష్టాలు కూడా ఉంటాయి. అందుకే క్రెడిట్ కార్డు వాడేందుకు కొందరు భయపడుతుంటారు. కాకపోతే క్రెడిట్ కార్డు జాగ్రత్తగా వాడుకుంటే ఏం కాదు.
క్రెడిట్ కార్డ్ ద్వారా క్యాష్ విత్ డ్రా
క్రెడిట్ కార్డును ఉపయోగించి ఏటీఎంలలో క్యాష్ విత్ డ్రా చేస్తే రెండు రకాల చార్జీలు పడుతాయి. 3.5% వరకు నగదు అడ్వాన్స్ ఫీజులు, ఏడాదికి 23 నుంచి 49 శాతం వరకు ఫైనాన్స్ ఛార్జీలు పడుతాయి. ఈ ఛార్జీలు డబ్బు విత్‌డ్రా చేసుకున్న తేదీ నుంచి తిరిగి చెల్లించే వరకు వర్తిస్తూనే ఉంటాయి. కాబట్టి, మీరు క్రెడిట్ కార్డు మీద నగదు విత్ డ్రా చేసి, గడువు తేదీలోగా చెల్లించకపోతే భారీగా ఛార్జీలను భరించాల్సి వస్తుంది. అందుకే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి.
లిమిట్ మొత్తాన్ని వాడేయడం
చాలా మంది క్రెడిట్ కార్డులో ఎంత లిమిట్ ఉంటే అంతా వాడేస్తుంటారు. ఇది క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తుంది. క్రెడిట్ బ్యూరోలు.. దీనిని ఎక్కువగా క్రెడిట్‌పై ఎక్కువగా ఆధారపడడానికి సంకేతంగా భావిస్తాయి. క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు ఖర్చును మొత్తం లిమిట్ లో 30 నుంచి 40శాతం వరకు మాత్రమే వినియోగించుకోవాలి. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి.
మనీ ట్రాన్స్ ఫర్ చేయవద్దు
ఒక క్రెడిట్ కార్డు నుంచి మరొక అకౌంట్లోకి ఎట్టి పరిస్థితిలోనూ మనీ ట్రాన్స్ ఫర్ చేయడం మంచి పద్ధతి కాదు. ఇక్కడ వడ్డీ రేటు అధికంగా చెల్లించాల్సి రావడమే కాకుండా.. ఎక్స్‌ట్రా ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది.
మినిమం బ్యాలెన్స్
క్రెడిట్ కార్డుల వాడే వాళ్లకు ఒక్కోసారి బిల్లు కట్టడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఆ సమయంలో తమ బిల్లులో మినిమం బ్యాలెన్స్ మొత్తాన్ని చెల్లిస్తే లేట్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఫైన్స్ కూడా పడవు. క్రెడిట్ కార్డ్ కూడా యాక్టివ్‌గా ఉంటుంది. క్రెడిట్ కార్డుల బిల్లు చెల్లించకపోతే ఫైనాన్స్ ఛార్జీలు చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్ని కార్డులకు సుమారు 40 శాతం కంటే ఎక్కువగా ఉంటాయి. అందుకే ఎంత వీలైతే అంత త్వరగా కట్టేయడం మంచిది.