Chandra Babu: చంద్రబాబుపై ఒక అపవాదు ఉంది. ఏదీ చివరి నిమిషం దాకా తేల్చరు అని పార్టీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. చాలా లేటుగా నిర్ణయాలు తీసుకుంటారని చెబుతుంటారు. అవే పార్టీకి ప్రతిబంధకంగా మారుతుంటాయని వ్యాఖ్యానిస్తుంటారు. అటు పార్టీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతున్న విమర్శలో.. లేకుంటే ఎవరైనా సలహా ఇచ్చారో తెలియదు కానీ..ఈ సారి తన పంథాను మార్చుకున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అన్నినియోజకవర్గాల సమీక్షలను మొదలు పెట్టారు. అయితే ఈ సారి ట్రెండ్ మార్చారు. గతంలో నియోజకవర్గ ముఖ్య నేతలందర్నీ రివ్యూకు పిలిచేవారు. ఈసారి మాత్రం కేవలం నియోజకవర్గ బాధ్యులనే పిలిపిస్తున్నారు. తాను తెప్పించుకున్న నివేదికలు వారి ముందే ఉంచుతున్నారు. గత మూడున్నరేళ్లుగా నియోజకవర్గంలో చేపట్టిన కార్యక్రమాలు, నాయకులు, కార్యకర్తల అండగా నిలబడిన పరిస్థితులు, ప్రభుత్వ వైఫల్యాలపై నిరసనలు తదితర అంశాలతో నియోజకవర్గ ఇన్ చార్జీలతో సమీక్షలు జరుపుతున్నారు. ఇప్పటివరకూ 60 నియోజకవర్గాల రివ్యూలు పూర్తయ్యాయి. 115 నియోజకవర్గాల సమీక్షలను పూర్తిచేసే పనిలో చంద్రబాబు ఉన్నారు.

అయితే రివ్యూలో నేతల పనితీరును ఉన్నది ఉన్నట్టు నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు. బాగా పనిచేసే వారిని అభినందిస్తూ.. ఎన్నికల వరకూ ఇదే పంథాను కొనసాగించాలని సూచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ పై భరోసా ఇస్తూ.. నియోజకవర్గంలో చక్కగా పనిచేసుకోవాలని కొన్ని సలహాలు ఇచ్చి పంపిస్తున్నారు. బాగా పనిచేయని నేతలను మాత్రం సుతిమెత్తగా హెచ్చరిస్తున్నారు. పనిచేస్తారా.. ప్రత్యామ్నాయం చూసుకోమంటారా అంటూ నేరుగానే అడిగేస్తున్నారు. టీడీపీ సభ్యత్వ నమోదు మొదలుకొని పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బాదుడే బాదుడు వరకూ అన్ని అంశాలపై సమీక్షిస్తున్నారు. నేతల పనితీరుపై తన వద్ద ఉన్న నివేదికలు బయటకు తీసి సమీక్షలు జరుపుతున్నారు. ఏదో తూతూమంత్రంగా కాకుండా నియోజకవర్గాల్లో లోటుపాట్లు, ఇతర అంశాలపై తాను తెప్పించుకున్న నివేదికలపై లోతైన విశ్లేషణ చేస్తున్నారు.
నియోజకవర్గాల్లో విభేదాలపై కూడా చంద్రబాబు దృష్టి పెట్టారు. ఎక్కడ అసమ్మతి ఉందో నేతలకు సవివరంగా చెబుతున్నారు. వారందర్నీ కలుపుకొని పోవాలని స్పష్టమైన ఆదేశాలిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణతో పాటు స్థానిక సమస్యలు, ప్రత్యర్థి పార్టీల బలాబలాలు నేతల ముందుంచుతున్నారు. వాటన్నింటినీ అధిగమించే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు. పార్టీలో యాక్టివ్ గా లేని వారు స్వచ్ఛందంగా తప్పుకోవాలని కూడా చంద్రబాబు గట్టిగానే చెబుతున్నారు. అక్కడ ప్రత్యమ్నాయ నాయకత్వం చూసుకుంటామని కూడా చెబుతుండడంతో నేతల్లో టెన్షన్ నెలకొంది. వైసీపీ ప్రభుత్వం పై వ్యతిరేకత పెల్లుబికుతున్న నేపథ్యంలో అందరు సమన్వయంతో పనిచేస్తే విజయం సాధించవచ్చని చంద్రబాబు వారికి హితబోధ చేస్తున్నారు.
అయితే ఎన్నడూ లేని విధంగా చంద్రబాబులో మార్పు కనిపిస్తోంది. మొహమాటలకు పోకుండా జాగ్రత్త పడుతున్నారు. బలమైన అధికార పక్షం ఉండడంతో.. గత అనుభవాలు, తప్పిదాలు జరగకుండా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనిపై టీడీపీ శ్రేణులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. అధినేతలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికలు టీడీపీకి ప్రతిష్టాత్మకంగా మారడంతో అడ్వాంటేజ్ తీసుకోరాదని చంద్రబాబు భావిస్తున్నారు. కొందరు సీనియర్లకు సైతం ముఖం మీదే చెప్పేస్తున్నారు.