KCR: తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న ఐటీ, ఈడీ దాడుల నేపథ్యంలో గులాబీ నేతల్లో అంతర్మధనం మొదలైంది. కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులను తిప్పి కొట్టాలని, ఐటీ, ఈడీ అధికారులు దాడులు చేస్తే ఎదురుదాడి చేయాలని పార్టీ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ సలహా ఇచ్చారు. ఇక కేసీఆర్ చెప్పిందే శిరోధార్యంగా భావించి మంత్రి మల్లారెడ్డి దానిని ఆచరణలో పెట్టారు. ఆయన ఐటీ అధికారులపై∙సంచలన ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టడం, తిరిగి ఐటీ అధికారులు మల్లారెడ్డిపై కేసు పెట్టడం, మల్లారెడ్డి ఆస్తులపైన ఐటీ అధికారులు ఈడీ అధికారులకు లేఖలు రాస్తున్నారన్న ప్రచారం వెరసి గులాబీ నేతలకు గుబులు పట్టుకుంది. సీఎం కేసీఆర్ చెప్పింది చేస్తే మరింత ఇరుక్కుంటామనే భయం వారిలో కనిపిస్తోంది.

టెన్షన్ పెడుతున్న మల్లారెడ్డి ఎపిసోడ్..
తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఆదాయపు పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులను ఎదుర్కోవడానికి పార్టీ నేతలను సమాయత్తం చేయాలని భావించారు. ఇందులో భాగంగా సమావేశం నిర్వహించి మరీ ఎదురు దాడులు చేయాలని, అవసరమైతే కేసులు పెట్టాలని వారికి హితోపదేశం చేశారు. దీంతో కేసీఆర్ తమ వెనక ఉన్నారు.. ఆయన మాటే శిరోధార్యమని భావించిన నేతల్లో మల్లారెడ్డి ఎపిసోడ్ చూసిన తర్వాత గులాబీ నేతల్లో టెన్షన్ మొదలైంది. కేంద్ర దర్యాప్తు సంస్థలతో పెట్టుకుంటే ముందు ముందు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొక తప్పదన్నన అభిప్రాయం గులాబీ నేతల్లో వ్యక్తమవుతోంది. కేటీఆర్‌కే ఐటీ దాడులకు భయపడి దుబాయ్‌లో కీలక పత్రాలు దాచివచ్చారన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తాము ఐడీ, ఈడీతో పెట్టుకోవడం ఎందుకని టీఆర్‌ఎస్ నేతలు గుసగుసలాడుతున్నారు.
మల్లారెడ్డిపై కేసు.. ఆపై ఈడీకి లేఖ…
ఇక మల్లారెడ్డి ఎపిసోడ్‌ను వదిలిపెట్టని ఐటీ అధికారులు భవిష్యత్తులో దాడులు చేస్తే మిగతా వారు కూడా మల్లారెడ్డి మాదిరిగా ప్రవర్తించకుండా ఉండటం కోసం మల్లారెడ్డి ఎపిసోడ్‌ను సీరియస్ గానే తీసుకుంటున్నారు. మల్లారెడ్డిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతోపాటు, తమపై మల్లారెడ్డి చేసిన ఫిర్యాదుపై శుక్రవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఐటీ అధికారులు తమ ల్యాప్‌టాప్‌ను మల్లారెడ్డి అనుచరులు తస్కరించారని, తమ ల్యాప్ టాప్ తమకు తెచ్చి ఇవ్వాలని స్థానిక పోలీసులపై తీవ్ర ఒత్తిడి పెడుతున్నారు. అంతేకాదు మరోవైపు మల్లారెడ్డి మెడికల్ కళాశాలల్లో వందల కోట్ల వసూలు జరిగాయని ఐటీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే వారు ఈడీకి లేఖ రాసి, ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్‌ను రంగంలోకి దించాలని భావిస్తున్నట్లు సమాచారం.
సైలెంట్‌గా ఉంటేనే ఉత్తమం..
సీఎం కేసీఆర్ మాటలు విని మల్లారెడ్డి అనవసరంగా ఐటీ అధికారులతో పంచాయితీ పెట్టుకున్నారు అన్న చర్చ గులాబీ నేతల్లో జరుగుతోంది. తమలో ఎవరిపైన ఐటీ దాడులు జరిగినా, ఈడీ దాడులు జరిగినా ఎదురుతిరిగి ఇష్యూని కాంప్లికేట్ చేసుకునే బదులు, సైలెంట్‌గా అధికారులకు సహకరిస్తే పోతుందని అనుకుంటున్నారట.

మరో 11 మందిపై దాడులు జరిగే చాన్స్..
ఇక ఇదే సమయంలో టీఆర్‌ఎస్ పార్టీలో 11 మంది నేతలపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. బడా వ్యాపారాలు నిర్వహిస్తున్న టీఆర్‌ఎస్ పార్టీ నేతలు కొందరు ఇప్పటి నుంచే అన్ని విషయాల్లో అప్రమత్తం అవుతున్నట్టుగా సమాచారం. ఇదే సమయంలో గులాబీ అధినేత చెప్పిన మాటలు వినాలి కానీ, అన్ని సందర్భాల్లోనూ వింటే దెబ్బతినేది మనమే అన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. మొత్తానికి మల్లారెడ్డి తాజా ఎపిసోడ్‌ను చాలా జాగ్రత్తగా గమనిస్తున్న గులాబీ నేతలు ఏం చేయాలి? ఏం చేయకూడదు? అన్నదానిపై మల్లారెడ్డి చేసిన ప్రయోగంతో ఒక అంచనాకు వస్తున్నారు. అవసరమైతే కేసీఆర్‌తతో విభేదించాలని కూడా భావిస్తున్నారట.