Telangana BJP: మేము బిజెపిలో లేమా? కనీస మర్యాద ఇవ్వకపోతే ఎలా?

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా అమిత్ షా ఆదివారం హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఈటల రాజేందర్ తో సమావేశమయ్యారు.

Written By: Bhaskar, Updated On : September 20, 2023 12:07 pm

Telangana BJP

Follow us on

Telangana BJP: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన కమలంలో చిచ్చు రేపుతోంది. అమిత్ షా నిర్వహించిన సమావేశానికి తమను ఆహ్వానించకపోవడం పట్ల వారంతా ఒకింత ఆగ్రహం గా ఉన్నారు. “అసలు మేము పార్టీలో లేమా? మాకు కనీసం గౌరవం ఇవ్వకపోతే ఎలా? కొందరితోనే అమిత్ షా భేటీ కావడం ఎంతవరకు సమంజసం” అని ఆ నాయకులు అంతర్గతంగా వాపోయారు. ప్రస్తుతం వీరు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇది తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

అమిత్ షా తమను పట్టించుకోకపోవడం పట్ల బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ నివాసంలో పార్టీ కీలక నేతలు భేటీ అయ్యారు. మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, విజయశాంతి, గరికపాటి రామ్మోహన్ రావు, చాడా సురేష్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మాజీ మంత్రులు డాక్టర్ విజయ రామారావు, రవీంద్ర నాయక్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, పార్టీ అధిష్టానం వైఖరి, భవిష్యత్తు కార్యాచరణతో పాటు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడి వైఖరి పైనా చర్చించారు.

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా అమిత్ షా ఆదివారం హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఈటల రాజేందర్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి తమను ఆహ్వానించకపోవడంపై సీనియర్ నేతలు ఒకింత ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. “పార్టీ అగ్ర నేతలు రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ఇక్కడ ముఖ్యమైన నాయకులకు సమయం ఇవ్వకపోవడం బాధాకరం. రాష్ట్ర పార్టీలో తామే నలుగురైదుగురు ఉండాలని కొందరు భావిస్తే ఎలా? ఇక మేము మాత్రం ఎందుకు? ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏం చేయాలో కూడా చర్చించకపోతే ఎలా” అని ఈ సమావేశంలో పలువురు నేతలు వాపోయినట్టు సమాచారం. తమను కూడా ఆహ్వానించే విషయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి బాధ్యత తీసుకొని ఉండాల్సిందని, ఆయన చొరవ తీసుకొని సమయం కోరితే అమిత్ షా కాదనేవారా? అని మరొక సీనియర్ నేత అన్నారు.”మంచి ఊపులో ఉన్న పార్టీని ఇప్పుడు చేజేతులా దెబ్బతీశారు. ఇప్పుడు ముఖ్య నేతలకూ గుర్తింపు ఇవ్వకపోతే ఎలా? భారీ సభలు, సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ కోసం వ్యయ ప్రయాసలకు ఓర్చి చిత్తశుద్ధితో పనిచేస్తున్న తమకు కనీసం మర్యాద కూడా ఇవ్వకపోతే ఎలా? కృతజ్ఞత లేదు, అభినందన అంతకంటే లేదు.” అని సమావేశంలో కొంతమంది ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.”జాతీయ నేతలు తమ ప్రయోజనాల కోసం మా రాజకీయ భవిష్యత్తును పణంగా పెడుతున్నారేమో అనిపిస్తుంది. ఇక రాష్ట్ర పార్టీలో అన్ని తామే అంటున్నవారు వారి వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకుంటున్నారు” అని పేరు రాసేందుకు ఇష్టపడని ఒక నేత వాపోయారు. ఇక ఈనెల 24న లేదా ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు ఒక సీనియర్ నేత వెల్లడించారు. కాగా, శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగతం పలికిన సందర్భంగా అమిత్ షా తమతో చూసి చూడనట్టుగా వ్యవహరించారని మరొక నాయకుడు వాపోయారు. ఇక ప్రస్తుత పరిస్థితులను చూస్తే తెలంగాణ బిజెపిలో ఇప్పుడప్పుడే పరిస్థితులు చక్కగయ్యేలా కనిపించడం లేదు. నివురు గప్పిన నిప్పులా ఉన్న ఈ వ్యవహారం ఎటువంటి ఉత్పాతాలకు దారి తీస్తుందోనని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.