Jagan: నేరం ఎవరు చేసినా నేరమే.. అక్రమం ఎవరు చేసినా అక్రమమే. తాము చేస్తే లోక కళ్యాణమని.. ఇతరులు చేస్తే వ్యభిచారం అన్న కోణంలో ఆలోచన చేయడం తగదు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో మీడియా చేసే అతి ఇలానే ఉంటుంది. తమకు నచ్చిన వారు చేస్తే ఒకలా.. నచ్చని వారు చేస్తే మరోలా వర్ణిస్తూ.. ఎల్లో మీడియా నానా యాగి చేస్తూ ఉంటుంది. ప్రజలను కన్ఫ్యూజ్ లో పెడుతోంది.
ఇటీవల చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆయన అవినీతి కేసుల్లో అరెస్టయ్యారు. కానీ ఆ మాట చెప్పేందుకు ఎల్లో మీడియా సాహసించదు. కేవలం స్కిల్ స్కాం కేసులో మాత్రమే ఆయన అరెస్ట్ అయినట్లు.. ఎటువంటి ఆధారాలు లేకుండా కేసులు మోపినట్లు రాసుకొస్తుంది. అదే జగన్ విషయంలో అయితే.. సిబిఐ కేసుల్లో చిన్నపాటి పురోగతి వచ్చినా.. అక్రమ ఆస్తుల కేసుల్లో అంటూ పతాక స్థాయిలో రాసుకు రావడం విశేషం. చంద్రబాబు కేసులు దర్యాప్తులో ఉన్నాయని అలా రాసుకోవడాన్ని సమర్ధించుకున్నా.. మరి జగన్ విషయంలో దర్యాప్తు పూర్తయిందా? ఆయన కేసులు సైతం దర్యాప్తు గడప దాటలేదు కదా? అంటే మాత్రం ఎల్లో మీడియా ఊరుకునే పరిస్థితిలో లేదు. చంద్రబాబు తమ వాడు కాబట్టి.. ఆయన ఏ తప్పు చేయలేదని వాదిస్తోంది. జగన్ తమకు గిట్టను వాడు కాబట్టి అలా వ్యవహరిస్తోంది.
చంద్రబాబు కేసులు వెనుక కేంద్ర పెద్దల హస్తం ఉందని అనుమానం వచ్చేలా రాతలు రాయడం ఎల్లో మీడియా కే సాధ్యం. అదే జగన్ విషయంలో కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని చెప్పడం కూడా తమ వ్యూహంలో భాగమే. జగన్ కు కేంద్ర పెద్దల సాయం ఉంటే.. వివేకానంద రెడ్డి హత్య కేసు ఆ స్థాయికి వచ్చి ఉండేదా? జగన్ కేసులు ఎప్పుడో మాయమయ్యేవి కదా? అంతెందుకు మొన్నటికి మొన్న ఈడీ సైతం కేసు విచారణను కొనసాగిస్తోంది కదా? కోర్టుకు అన్ని వివరాలు సమర్పిస్తోంది కదా? అంటే అది వేరే లెక్క అన్నట్టు ఎల్లో మీడియా వ్యవహరిస్తోంది.
తమకు కానీ, తమవారి జోలికి రాకూడదనేది ఎల్లో మీడియా భావన. ఇప్పుడు అర్జెంటుగా చంద్రబాబు అధికారంలోకి రావాలి. అది అనివార్యం.. ఈ రాష్ట్రానికి అవసరం అన్న రేంజ్ లో ప్రచారం చేయడం ఎల్లో మీడియా ముందున్న తక్షణ కర్తవ్యం. అందుకే విషపు రాతలతో, పక్షపాత ధోరణితో రాజ గురువు రామోజీ, దమ్మున్న ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ బరితెగించి వ్యవహరిస్తున్నారు. విషపు రాతలతో రెచ్చిపోతున్నారు. ఏపీ ప్రజలకు రోత పుట్టిస్తున్నారు.