Visakhapatnam Fishing Harbour: విశాఖ హార్భర్ లో అంతటి భారీ అగ్ని ప్రమాదం వెనుక షాకింగ్ కోణమిదీ

వేలాదిమంది మత్స్యకారులు ఫిషింగ్ హార్బర్ లో ఉపాధి పొందుతారు. వందలాది బోట్లలో మత్స్యకారులు వేటకు వెళుతుంటారు. వేటాడి తెచ్చిన మత్స్య సంపద సైతం అగ్నికి ఆహుతి కావడంతో మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Written By: Dharma, Updated On : November 20, 2023 3:03 pm
Follow us on

Visakhapatnam Fishing Harbour: విశాఖ ఫిషింగ్ హార్బర్ లో ఘోర అగ్ని ప్రమాదం మత్స్యకారుల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అంతా గాఢ నిద్రలో ఉండగా జరిగిన ఈ ప్రమాదం.. గంగపుత్రులకు కాళరాత్రిగా మారింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 బోట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. మత్స్యకారులకు ఊహకు అందని నష్టం జరిగింది. రూ.40 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. అయితే అంతకుమించి నష్టం జరిగిందని మత్స్యకారులు చెబుతున్నారు. అయితే ఇది ఆకతాయిల పని వల్లే ఇలా జరిగిందన్న ప్రచారం జరుగుతోంది.

వేలాదిమంది మత్స్యకారులు ఫిషింగ్ హార్బర్ లో ఉపాధి పొందుతారు. వందలాది బోట్లలో మత్స్యకారులు వేటకు వెళుతుంటారు. వేటాడి తెచ్చిన మత్స్య సంపద సైతం అగ్నికి ఆహుతి కావడంతో మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి ఓ మందు పార్టీయే కారణమని తెలుస్తోంది. ఓ బోటులో కొంతమంది యువకులు మద్యం తాగుతూ క్రికెట్ మ్యాచ్ చూసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బోటు అమ్మకం విషయంలో తలెత్తిన వివాదం కొట్లాటకు దారి తీసినట్లు సమాచారం. ఆ క్రమంలో బోటుకు నిప్పంటుకుందని.. అది మిగతా బోట్లకు వ్యాపించిందని ప్రచారం జరుగుతోంది. పోలీసులు సైతం ఇదే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదంతో వందలాది మత్స్యకార కుటుంబాలు వీధిన పడ్డాయి. వారికి కోలుకోలేని దెబ్బ తగిలింది. దీంతో తమకు న్యాయం చేయాలని కోరుతూ మత్స్యకార కుటుంబాలు ఆందోళనకు దిగాయి. ప్రభుత్వమే తమకు నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేస్తూ హార్బర్ గేటు వద్ద బైఠాయించారు. అయితే ఈ ఘటనలో యూట్యూబ్ పేరు బయటకు రావడంసంచలనం రేకెత్తిస్తోంది.ఓ బోటు అమ్మకంలో జరిగిన వివాదమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. హార్బర్ చరిత్రలో ఇంత పెద్ద ప్రమాదం ఎప్పుడూ చూడలేదని మత్స్యకారులు చెబుతున్నారు. సాధారణంగా బోటు కింది భాగంలో మత్స్యకారుల వలలు, డీజిల్, వంట చేసుకునే గ్యాస్ ఉంటాయి. ఒక్కసారిగా మంటలు రేగి… మిగతా బోట్లకు వ్యాపించడానికి ఇవే కారణాలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణలో పోలీసులు ఉన్నారు. అయితే అనుమానిత యువకులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.