Jagan or Chandrababu: కరువు, చంద్రబాబు కవల పిల్లలు. దశాబ్దాలుగా చంద్రబాబు పై ఉన్న అపవాదు ఇది. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చిన కరువు తాండవిస్తుందన్నది ప్రచారం. ఆపై వాస్తవానికి దగ్గరగా ఉన్న మాట ఇది. క్రమేపి అది రైతాంగంలో నాటుకు పోయింది. ఇప్పుడు దాని చెరిపే ప్రయత్నం చేస్తున్నారు టిడిపి శ్రేణులు. ఇప్పుడు ఏపీలో కరువు నెలకొనడంతో.. ఆ అపవాదును జగన్ పై తోసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ దిశగా ప్రచారం కూడా చేస్తున్నారు.
1995లో తొలిసారిగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటినుంచి ఆయన అధికారంలో ఉన్న 2004 వరకు.. యాట కరువు పరిస్థితులే. రాష్ట్రంలో మూడో వంతు కరువు ఛాయలే. అందుకే చంద్రబాబు, కరువు కవల పిల్లలని విపక్ష నాయకులు ఆరోపణలు చేసేవారు. దానిని పెద్ద ఎత్తున ప్రచారం చేసేవారు. ఒకానొక దశలో చంద్రబాబు వ్యవసాయం దండగ అన్న మాట అన్నారని కూడా ఆరోపణలు చేశారు. అయితే ఆ తరువాత అధికారంలోకి వచ్చిన రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మాత్రం కరువు చాయలు కనిపించలేదు. దీంతో చంద్రబాబు పై ఉన్న ముద్ర సజీవంగా ఉండిపోయింది.
చంద్రబాబు తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ హయాంలో సైతం పెద్దగా కరువు కనిపించలేదు. తొలి నాలుగు సంవత్సరాలు పంటలు బాగానే పడ్డాయి. కానీ చివరి ఏడాదికి వచ్చేసరికి తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కరువు చాయలు కనిపిస్తున్నాయి. 400 మండలాల్లో కరువు ఉండగా.. ఇప్పటివరకు ప్రభుత్వం 110 మండలాల వరకు గుర్తించింది.దీంతో ఇప్పుడు టిడిపి నేతలకు జగన్ టార్గెట్ అవుతున్నారు. చంద్రబాబు పై ఉన్న అపనిందను జగన్ పై నెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 120 సంవత్సరాలకు కరువు ఈ ఒక్క ఏడాదిలోనే కనిపిస్తోందని.. అది నీ ముఖంలోనే దర్శనమిస్తోందని సోషల్ మీడియాలో జగన్ ఫోటో పెట్టి ప్రచారం చేస్తున్నారు. టిడిపి శ్రేణులు తెగ వైరల్ చేస్తున్నారు. అయితే వైసిపి తిప్పికొట్టే ప్రయత్నంలో 1995 నుంచి 2004 వరకు కరువును గుర్తుచేస్తూ ప్రచారం చేస్తుండడం విశేషం.