ఆంధ్రప్రదేశ్ వైసీపీలో అసమ్మతి రాగం వినిపిస్తోంది. కష్టపడి పనిచేసిన వారికి పదవులు దక్కకుండా పోతున్నాయి. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని అందలాలు ఎక్కిస్తున్నారు. దీంతో సొంత పార్టీలోనే అసమ్మతి కుంపట్లు అంటుకుంటున్నాయి. ఎన్నికలకు ముందు జగన్ 40 మంది వరకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందరికి న్యాయం చేస్తామని చెప్పిన సీఎం ఇప్పుడు తప్పించుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వైసీపీలో అసంతృప్తి అనేది చాపకింద నీరులా వ్యాపిస్తోంది.
2014, 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడినవారు, పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉన్న వారిని పట్టించుకోవడం లేదు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారు. ఎన్నికల ముందు టీడీపీలో ఎంపీగా ఉన్న పండుల రవీంద్రబాబు వైసీపీలో చేరిన వెంటనే ఎమ్మెల్సీ అయ్యారు. ఎస్సీ వర్గానికి చెందిన ఆయనకు ఈ పదవి కట్టబెట్టడంతో పార్టీలో ఉన్న సీనియర్లు రగిలిపోతున్నారు. పార్టీ కోసం పదేళ్లుగా కష్టపడిన వారికి కాదని కష్టపడకుండా ఎన్నికలకు ముందు వచ్చిన వారికి ఎమ్మెల్సీ పదవులు ఇవ్వడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు.
గత ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రస్తుత మంత్రి చేతిలో ఓడిపోయిన తోట త్రిమూర్తులు వైసీపీలోకి వచ్చిన వెంటనే అమలాపురం పార్లమెంటరీ పార్టీ అధ్యక్ష పదవితోపాటు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. త్రిమూర్తులు అంటే రాజ్యసభ సభ్యుడు పిల్లి బోస్ కు పడదు. అయినా జగన్ వారిని పార్టీలో చేర్చుకుని పదవులు కట్టబెట్టారు.పైగా అటు పండుల ఇటు త్రిమూర్తులు ఇద్దరూ ఒకే జిల్లా, అందులోనూ గతంలో టీడీపీలో కలిసి ఎంపీ, ఎమ్మెల్యేలుగా పనిచేసినవారే.
జగన్ గత ఐదారేళ్లుగా ఎమ్మెల్సీ పదవి ఇస్తా అన్న నేతలకే ఇప్పుడు దిక్కు మొక్కు లేకుండా పోతోంది. మర్రి రాజశేఖర్ చిలుకలూరిపేట సీటు త్యాగం చేసినందుకు ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి ఇస్తానని చెప్పారు. ఇప్పటి వరకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు. గొట్టిపాటి భరత్, జంకే వెంకటరెడ్డి లాంటి వారు 2014 సమయంలో పార్టీ కోసం ఎంతో కష్టపడడంతో పాటు ఆర్థికంగా నష్టపోయారు. వీరికి హామీ ఇచ్చి కూడా పదవులు దక్కలేదు. దీంతో వీరిలో అసంతృప్తి రగులుతూనే ఉంది.