చంద్రబాబు నాయుడు.. ఆయన గ్రేట్ లీడర్ అనే చెప్పాలి. ఎందుకంటారా..!! ఆయన వ్యవస్థలను ఏ స్థాయిలో మేనేజ్ చేయగలరో అందరికీ తెలిసిందే. ఈ విషయంలో ఆయన దేశంలోనే ముందున్నారనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఉన్నది లేనట్టుగా,., లేనిది ఉన్నట్టుగా.. సృష్టించడంలో ఆయనకు ఆయనే సాటి. కోర్టు తీర్పులను సైతం ప్రభావితం చేయగల నేత ఆయన. పార్టీలను సైతం పొత్తు కోసం మెస్మరైజ్ చేయగలరు.
గత 2014 ఎన్నికల్లో టీడీపీ–బీజేపీ–జనసేనలతో కలిసి పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో ఎలాగోలా విజయం సాధించారు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉండిపోయారు. ఆ మధ్య ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలోనూ పెద్ద కేసు నమోదైనా ఇప్పటివరకు చంద్రబాబుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్టీఫెన్ సన్‌కు ఓటు కోసం డబ్బులు ఎరజూపిన విషయం తెలిసిందే. ఓటుకు నోటు కేసులో బాబు ఇరుక్కున్నారు. దాంతో హైదరాబాద్ నుంచి ఏపీకి షిఫ్ట్ అయ్యారు.
ఇక చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అమరావతి అంశాన్ని ఎంచుకున్నారు. ఇదిలా ఉంటే.. మీడియా మేనేజ్‌మెంట్‌తో ఆయా పార్టీలపై విరుచుకుపడ్డారు. కడప లోకల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డిని ఓడించడానికి మీడియాను వాడుకున్నారు. మీడియాను మేనేజ్ చేయడంలోనూ చంద్రబాబు దిట్ట. అందుకే.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన మీడియా అంతా కూడా ఆయన చేతుల్లోనే ఉంది. అలా మీడియాను వాడుకుంటూ తన లోపాలు ఎక్కడా బయటపడకుండా చూసుకుంటూ వస్తున్నారు.

ఏ విషయంలోనైనా ద్వంద్వ ప్రమాణాలు పాటించడం చంద్రబాబుకు అలవాటు. అప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలోనూ.. ఇరు రాష్ట్రాల ప్రజలు రెండు కళ్లలాంటి వారంటూ చెప్పుకొచ్చారు. ఈ రెండు కళ్ల సిద్ధాంతమే తెలంగాణలో పార్టీకి పుట్టగతులు లేకుండా చేసింది. అటు ఏపీకి ప్రత్యేక హోదా విషయంలోనూ అలానే చేశారు. హోదా వద్దంటూ ఒకసారి.. లేదు హోదా ఇవ్వాల్సిందేనంటూ మరోసారి.. అదీకాదంటే ప్రత్యేక ప్యాకేజీ కావాలంటూ ప్రతిపాదనలు పెట్టారు.
ఇక కొన్ని రోజుల పాటు బీజేపీతో పొత్తు వ్యవహారం సాగించి చివరికి ఆ పార్టీని వాడుకొని వదిలేశారనే అపవాదును మూటగట్టుకున్నారు. అధికారంలోకి వచ్చాక పూర్తిగా ఆ పార్టీ లీడర్లను పక్కన పెట్టేశారు. అంతేకాదు.. బీజేపీతో అంటకట్టుకొని ఉన్న టీడీపీ ఎంపీలను బయటకు లాగేశారు. ఇక తన మద్దతు బీజేపీకి లేదని.. దేశంలో మోడీ హవా అయిపోఇయందని.. రాజకీయాల నుంచి మోడీ వెళ్లిపోతారంటూ ప్రచారం సాగించారు. బీజేపీకి శత్రువులుగా చెప్పుకొనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్ సీఎం మమతతో చేతులు కలిపారు. ఇదిలా ఉంటే.. భవిష్యత్ ప్రధాన తానేనంటూ.. ఏపీకి తన కొడుకు లోకేష్ సీఎం అంటూ గొప్పలు చెప్పుకొచ్చారు. కానీ… ఏం లాభం ఇప్పుడు ఆయన పార్టీ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిన విషయమే.
ఇప్పుడు అవే తప్పిదాలు ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వారు అభివృద్ధి, నిరుద్యోగం, ఉద్యోగుల క్షేమం వంటి విషయాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. తెలంగాణలో ఇప్పటికే ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం బలిదానాలు కూడా జరిగాయి. అయినా కూడా ప్రభుత్వంలో ఎలాంటి స్పందన కనిపించడం లేదు. ఇక జగన్ కూడా ఎంతసేపూ ప్రజల సంక్షేమ పథకాలనే అమలు చేస్తున్నారు తప్పితే.. రాష్ట్ర అభివృద్ధిపై ఎలాంటి ఫోకస్ పెట్టడం లేదు. అందుకే.. వీరికి కూడా భవిష్యత్తులో ఇబ్బందులు తప్పేలా లేవని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.