తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అందరిచూపు హూజూరాబాద్ వైపే ఉంది. ఇక్కడ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడకముందే రాజకీయ సమీకరణాలు జోరందుకున్నాయి. ఇతర పార్టీల కంటే అధికార పార్టీ ఇక్కడ గెలుపుకోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటి వరకు టీఆర్ఎస్ లో మంత్రిగా కొనసాగిన ఈటల రాజేందర్ ప్రత్యర్థి కావడంతో గులాబీ నేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల తాయిలాలు ప్రకటిస్తున్నారు. ఇక్కడి ఉప ఎన్నికపై స్వయంగా సీఎం కేసీఆర్ పర్యవేక్షించడంపై ఈ నియోజకవర్గం పేరు మారుమోగుతోంది.
ముఖ్యంగా నియోజకవర్గంలోని దళితులను ఆకట్టుకునేందుకు సీఎం భారీ ప్రణాళికలు వేస్తున్నారు. దాదాపు 20 ఏళ్లుగా ఇక్కడి నియోజకవర్గంలోని దళితులు ఈటల రాజేందర్ వెంటే ఉన్నట్లు ఇంటలిజెన్స్ సర్వే తేల్చింది. ఇప్పుడు ఆయనను టీఆర్ఎస్ నుంచి భర్తరఫ్ చేసిన తరువాత వారంతా ఆయన వెంటే ఉన్నట్లుు సీఎంకు సమాచారం అందింది. దీంతో దళితులను ఆకట్టుకునేందుకు కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రశేపెట్టారని అంటున్నారు. అంతేకాకుండా ఫైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంపిక చేయడంపై కూడా ఇక్కడి దళితులను ప్రసన్నం చేసుకునేందుకే అని అంటున్నారు.
తాజాగా కేసీఆర్ నియోజకవర్గానికి చెందిననేతకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. బండా శ్రీనివాస్ అనే దళిత నేతకు ఈ పదవి ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలో 41 వేలకు పై గా దళిత ఓట్లు ఉన్నాయి. ఇప్పటికే కేసీఆర్ దళిత బంధు పథకం పేరిట కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున నిధులను విడుదల చేయనున్నారు. ఇక రాను రాను మరెన్నో పథకాలు వస్తాయని ఇక్కడి నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఇదిలా ఉండగా దళితులకు ఆకట్టుకుంటున్న కేసీఆర్ పార్టీ అభ్యర్థిత్వంపై ఎలాంటి సిగ్నల్ ఇవ్వడం లేదు. ఇటీవల కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి పార్టీ లో చేరినా ఆయన పేరు మాత్రం ప్రకటించలేదు. తాజాగా ఓ ఎన్నారై పేరు వినిపిస్తోంది. ఆ మధ్య ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అని ప్రచారం జరిగినా ఆయన పోటీ చేయనని క్లారిటీ ఇచ్చారు. ఏదీ ఏమైనా కేసీఆర్ ఈ నియోజకవర్గంలో పాగా వేయడానికి పెద్ద వ్యూహమే పన్నుతున్నారు.