
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) లాక్ డౌన్ కారణంగా 58 రోజుల నుంచి బస్సుల రాకపోకలను పూర్తిగా నిలిపివేసింది. దీంతో సంస్థ రూ.1,200 నష్టాన్ని మూటగట్టుకుంది. నేటి నుంచి బస్సులు నడుపుతున్నప్పటికీ వాటి సంఖ్య అరకొరె. నష్టాల నుంచి గట్టెక్కే పరిస్థితి కనుచూపు మేరలో కనిపించక పోవడంతో కొన్ని దిద్దుబాటు చర్యలతో నష్టాలను కొంతమేరకు తగ్గించుకోవచ్చని భావిస్తోంది.
ఈ క్రమంలో వివిధ వర్గాల వారికి కల్పిస్తున్న రాయితీ అంశంపై కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధులు, దివ్యాంగులు, విద్యార్థులు, పాత్రికేయులు సహా వివిధ వర్గాలకు అందిస్తున్న రాయితీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా భౌతిక దూరం పాటించాల్సిన నేపథ్యంలో బస్సుల్లో సీట్ల సంఖ్యను ఆర్టీసీ కుదించింది. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ సహా ఏసీ సర్వీసుల్లో సీట్లను తగ్గించింది. దీంతో ఆర్థికంగా సంస్థకు నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నందున వివిధ వర్గాలకు అందిస్తున్న రాయితీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది.