CM KCR
CM KCR: మొన్నటిదాకా అయితే ప్రగతి భవన్.. లేకుంటే ఫామ్ హౌస్.. అపాయింట్మెంట్ దొరికేది కాదు. ఎవరిని కలవాలి అనుకుంటున్నారో.. వారికి మాత్రమే ప్రగతి భవన్ గేట్లు తెరుచుకునేవి. మిగతా వారికి ఆ అవకాశం ఉండేది కాదు. ఈ జాబితాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఉండేవారు. వారు బయటకు చెప్పలేక.. అధినేత దర్శనం లభించక లోలోపల మదనపడుతుండేవారు.. అక్కడిదాకా ఎందుకు సాక్షాత్తు హోం శాఖ మంత్రినే బయటికి పంపేసిన దాఖలాలు ఉన్నాయి.. అంతేకాదు తనకు ఎవరైనా ఎదురు తిరిగి మాట్లాడితే నిర్దాక్షిణ్యంగా బయటికి పంపిస్తున్న చరిత్ర ఉంది. అలాంటి వారి మీద అడ్డగోలుగా ఆరోపణలు చేయించిన ఘనత కూడా ఉంది. కానీ అలాంటి అధినేత ఒక్కసారిగా ఇప్పుడు మారిపోయారు. కిందికి దిగివస్తున్నారు. ఇనుపకంచెల మధ్య ఉన్న ప్రగతి భవన్ నుంచి ఆహ్వానం పలుకుతున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అది కూడా రాజకీయ పరిస్థితులు పార్టీకి ఇబ్బందిగా మారుతుండటంతో ఆయనలో ఉన్న మార్మికత ఇప్పుడు బయటపడుతోంది. అంతేకాదు అసంతృప్తులను స్వయంగా ప్రగతిభవన్‌కు ఆహ్వానిస్తున్నారు. వారిని బుజ్జగిస్తూ పదవుల ఎర వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కు రోజురోజుకూ గ్రాఫ్ పెరుగుతుండటం, బీఆర్‌ఎస్ గ్రాఫ్ పడిపోతుండటమే ఇందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గులాబీ పార్టీలో అంతర్మథనం మొదలైందని, టికెట్లు ప్రకటించినప్పటి ధీమా ఇప్పుడు పూటపూటకూ సడలుతోందని అంటున్నారు. అయినా పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తప్పులను సరిదిద్దుకునేందుకు పార్టీ పెద్దలు రంగంలోకి దిగుతుండడం, ముఖ్యంగా సీఎం కేసీఆర్ తన వైఖరికి విరుద్ధంగా ఒక్కో మెట్టు దిగుతుండడాన్ని ఉదహరిస్తున్నారు. ఇప్పటిదాకా ‘నేను ఇలాగే ఉంటాను.. నా వైఖరితో నష్టపోయిందేమీ లేదు’ అన్న భావనలో ఉన్న సీఎం కేసీఆర్.. ఆ వైఖరితో మొదటికే మోసం వస్తుందని గ్రహిస్తున్నారని, ముఖ్యంగా కొందరికి అడిగిన వెంటనే అపాయింట్‌మెంట్‌ఇచ్చేస్తున్నారని చెబుతున్నారు.
గతంలో ఏళ్ల తరబడి ఎదురుచూసినాసీఎం కేసీఆర్ దర్శనం కష్టతరమయ్యేది. ప్రజా గాయకుడు గద్దర్ లాంటివారే 40 సార్లు ప్రయత్నించినా సీఎంను కలవలేకపోయారు. మోత్కుపల్లి నర్సింహులు లాంటి సీనియర్ నేత కూడా ముఖ్యమంత్రిని కలిసేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించినా సాధ్యం కాలేదని తాజాగా వాపోయారు. ఇక 2014లో గెలిచినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను ముఖాముఖి కలిసిన ఎమ్మెల్యేలు, ఎంపీలను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.” ప్రగతిభవన్ అంటేనే ఓ దుర్గం అని, పార్టీ ఎమ్మెల్యేలు సైతం అక్కడికి వెళ్లలేని రాజకోటగా మారిందని, తమ ముఖ్యమంత్రే తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వరని” ఆ పార్టీ నేతలు అంటున్నారంటే అందులో ప్రజాస్వామ్యం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అవగతమవుతుంది. అయితే దీనిని చివరి దశలో సరిదిద్దుకునేందుకు పార్టీ పెద్దలు నానా తిప్పలు పడుతున్నారు. ఇప్పుడు అడిగిన వెంటనే అపాయింట్‌మెంట్ ఇస్తున్నా.. ఎన్నికల కోసమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బుజ్జగిస్తున్నారు
మరికొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రానుంది. బీఆర్‌ఎస్ ఇప్పటికే నాలుగు స్థానాలు మినహా మిగిలిన అన్ని స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించింది. అయితే టికెట్ ఆశించి భంగపడ్డ వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారిని మొదట్లో పెద్దగా పట్టించుకోని అధిష్ఠానం.. క్షేత్రస్థాయిలో వారితో జరుగుతున్న నష్టంతో మేల్కొంది. వారికి పదవుల ఆశచూపి బుజ్జగిస్తోంది. జనగాం, స్టేషన్ ఘన్‌పూర్ సిటింగ్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య విషయంలో ఇదే జరిగింది. అధిష్ఠానం వీరికి టికెట్లు నిరాకరించడంతో.. రాజయ్య ఒక దశలో పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పార్టీ పెద్దలు ఆ ఇరువురిని ప్రగతి భవన్‌కు పిలిపించి బుజ్జగించారు. ఒకరికి రాష్ట్ర రైతుబంధు సమితి చైర్మన్ పదవి, మరొకరికి ఆర్టీసీ చైర్మన్ పదవి ఇస్తామని ఆశల హామీ ఇచ్చారు. అలాగే ఇతర నియోజకవర్గాల్లో కూడా పార్టీకి తీరని నష్టం కలిగిస్తారనుకున్న వారిని పిలిచి మాట్లాడుతున్నారు. ప్రభుత్వం చివరి దశకు చేరుకున్న సమయంలో.. ఏళ్లుగా భర్తీ చేయని పదవుల పందేరానికి కూడా శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో రెండేళ్లుగా ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు నూతన చైర్మన్, సభ్యులను నియమించారు.
ఎదిరించే స్వరాలపై మౌనం..
పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించే వారి విషయంలో గతంలో సీఎం కేసీఆర్ వైఖరి చాలా కఠినంగా ఉండేది. పార్టీలో ఎక్కడా ధిక్కార స్వరాలు వినిపించేవి కావు. ఒకటీ అరా వినిపించినా.. గంటల వ్యవధిలో ఆ నోళ్లు మూతబడేవి. పార్టీపై, నేతలపై పెద్దలకు అంతలా పట్టుండేది. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. ధిక్కార స్వరాలు వినిపించే వారి జోలికి వెళ్లే సాహసం చేయడం లేదు. ఇంకా చెప్పాలంటే.. అటువంటి నేతలను పదవులిచ్చి మరీ ప్రోత్సహించే సంస్కృతి బీఆర్‌ఎస్ లో తొలిసారిగా కనిపిస్తోంది. ఉదాహరణకు.. రంగారెడ్డి జిల్లాకు చెందిన పట్నం మహేందర్ రెడ్డి అధిష్ఠానంపై అసంతృప్తితో కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధం కాగా, ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. ప్రజాబలం ఉన్న నేత కావడం, ఆ జిల్లాపై ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో ఆయనపై వేటుకు బదులు.. మంత్రి పదవి ఇచ్చి చల్లబరిచారు. ఇక మంత్రి హరీశ్‌రావుపై, పార్టీ అధిష్ఠానంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు విషయంలో పార్టీ పెద్దలు మౌనమే వహించారు. చోటా మోటా నేతలే మైనంపల్లిపై స్పందించారు. వాస్తవానికి హన్మంతరావు చేసిన వ్యాఖ్యలు మరే ఇతర నేత చేసినా ఈ పాటికి వేటు పడి ఉండేది. వివిధ రకాల కేసులు కూడా నమోదయ్యేవి. కానీ, మైనంపల్లిపై ఎటువంటి చర్యలూ తీసుకునే సాహసం చేయలేదు. పార్టీ ఎలాగూ చర్య తీసుకునే పరిస్థితి లేకపోవడంతో ఆయనే బీఆర్‌ఎస్ కు బైబై చెప్పేశారు. మొత్తానికి ఈ పరిణామాలతో భారత రాష్ట్ర సమితి పార్టీలో ఏదో తెలియని భయం ఆవరించిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.. అయితే ఈ మార్పు మొదటి నుంచి ఉంటే ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండేది కాదని వారు చురకలు అంటిస్తున్నారు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Appointment on request what is the reason for this change in kcr
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com