Homeఆంధ్రప్రదేశ్‌AP Sachivalayam Employees: ఇదేం ప్రభుత్వ ఉద్యోగం... ఆవేదనలో సచివాలయ కార్యదర్శులు

AP Sachivalayam Employees: ఇదేం ప్రభుత్వ ఉద్యోగం… ఆవేదనలో సచివాలయ కార్యదర్శులు

AP Sachivalayam Employees:  ప్రభుత్వ ఉద్యోగమని తెగ సంబర పడిపోయారు. లక్షలాది రూపాయల ప్రభుత్వ కొలువును వదులుకున్నారు. కుటుంబసభ్యుల కళ్లెదుటే ఉండి దర్జా, డాబు ఉంటుందని అనుకున్నారు. తీరా ఉద్యోగంలో చేరికా తెలిసింది అటెండర్‌కు ఎక్కువ, గుమస్తాకు తక్కువ అన్నట్లుగా ఉండే పోస్టు అదని. రిక్రూట్‌మెంట్‌ సమయంలో ప్రభుత్వం గొప్ప ఉద్యోగమంటూ ఆర్భాటంగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. గ్రూప్‌-1 స్థాయిలో ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించడంతో నిరుద్యగో యువత పోటా పోటీగా పరీక్షలు రాశారు. ఏళ్ల తరబడి ఉద్యోగాల నోటిఫికేషన్లు లేని సమయంలో దొరికిందే మహా భాగ్యమంటూ యువత ఈ ఉద్యోగాల్లో చేరిపోయారు.

AP Sachivalayam Employees
AP Sachivalayam Employees

సాఫ్ట్‌వేర్‌ వంటి రంగాలను సైతం వదిలేసి కొందరు, సొంత ఊళ్లో ఉంటూ సర్కారు కొలువు చేసుకోవచ్చనే భావనతో మరి కొందరు గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల ఉద్యోగాల్లో చేరారు. గత ఏడాది అక్టోబరు 2 నాటికి వీరంతా ఉద్యోగంలో చేరి రెండేళ్లు పూర్తయింది. నిబంధనల ప్రకారం వారి ప్రొబేషన్‌ ప్రకటించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం వారిని రెగ్యులర్‌ చేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు కార్యదర్శులు రోడ్డెక్కాల్సి వచ్చింది. ఈ నిరసనలతో దిగివచ్చిన సర్కారు… 2022 జూన్‌ నుంచి రెగ్యులర్‌ చేస్తామని, ఈలోపు డిపార్ట్‌మెంట్‌ టెస్ట్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని మెలిక పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖలకు సంబంధించి గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులు 86 వేల మంది ఇటీవల డిపార్ట్‌మెంట్‌ పరీక్షలు రాశారు.

Also Read: AP New Cabinet: వైసీపీలో తప్పిన క్రమశిక్షణ.. సీఎం జగన్ లో కలవరం

కానరాని నిబంధనలు
పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిలో ప్రభుత్వం కనీస నిబంధనలు పాటించలేదు. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరీక్ష పెట్టినప్పుడు ‘కీ’ విడుదల చేసేవారు. అభ్యంతరాలుంటే అప్పీలు చేసుకునే అవకాశం ఉండేది. ఫైనల్‌ ‘కీ’తో పాటు ఫలితాలు ప్రకటించేవారు. అయితే ఇప్పుడు మాత్రం ఫలితాలు నేరుగా ప్రకటించి ఎక్కడా లేని నిబంధనలను ఈ ఉద్యోగులకు అమలు చేశారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటుచేసి 1.34లక్షల కార్యదర్శుల పోస్టుల నియామకాలు చేపట్టిన వైసీపీ సర్కారు… వారిని క్రమబద్ధీకరించడంలో మితిమీరిన తాత్సారం చేస్తోంది. జూన్‌ నుంచి రెగ్యులర్‌ చేస్తామని చెప్పి ఏపీపీఎస్సీ ద్వారా డిపార్ట్‌మెంట్‌ పరీక్షలు నిర్వహించి, 10శాతం మందిని కూడా పాస్‌ కానీయకుండా అడ్డుకుని పొమ్మనకుండానే పొగబెడుతోందని పలువురు విమర్శిస్తున్నారు.

AP Sachivalayam Employees
AP Sachivalayam Employees

ఉద్యోగాల కోసం రాసిన డీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన తమను డిపార్ట్‌మెంట్‌ టెస్ట్‌ల్లో ఫెయిల్‌ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. నియామకాల సమయంలోనే ఇంటర్‌ అర్హత కలిగిన ఉద్యోగాలకు డిగ్రీ అర్హత ఉండాలని పేర్కొన్నారని, టీచర్లకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించిన స్థాయిలో తమకూ పరీక్షలు జరిపి పోస్టులు భర్తీ చేశారని పేర్కొంటున్నారు. ఉద్యోగాల్లో చేరేందుకు పరీక్షలు పాసయిన తాము రెగ్యులర్‌ అయ్యేందుకు అర్హత లేకుండా పోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో గానీ దేశంలో గానీ ఏ నియామకాల్లోనైనా ఇలాంటి విధానం అవలంబించారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రతి పరీక్షలకు ‘కీ’ విడుదల చేస్తున్న ఏపీపీఎస్సీ… తమ డిపార్ట్‌మెంట్‌ టెస్ట్‌లకు మాత్రం విడుదల చేయకపోవడం వెనుక మర్మమేమిటని నిలదీస్తున్నారు.

ఇటీవల ఏపీపీఎస్సీ నిర్వహించిన డిపార్ట్‌మెంట్‌ పరీక్షలను సచివాలయ సిబ్బంది రాశారు. అందులో కోడ్‌ నం.8, 10 పేపర్లను అత్యంత కఠినంగా ఇవ్వడంతో అత్యధిక శాతం మంది ఫెయిలయ్యారు. పేపర్‌ను ఐఏఎస్‌ పరీక్షల రేంజ్‌లో ఇచ్చారంటున్నారు. సిలబ్‌సలో లేని ప్రశ్నలు ఇచ్చారని, పరీక్షల ప్రామాణికత బయటపడుతుందన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ‘కీ’ విడుదల చేయకుండా నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తున్నారు. పరీక్షలు రాసిన అభ్యర్థులందరూ పదోన్నతుల కోసం ఉద్దేశించిన కోడ్‌ నం.146, 148 పేపర్లు కూడా రాశారు. ఇందులో 90శాతం మంది పాసయ్యారు.

ఇవ్వని పదోన్నతి కోసం రాసిన పరీక్షల్లో ఉత్తీర్ణులను చేశారని, ఇప్పుడు తక్షణం రెగ్యులర్‌ చేసేందుకు ఉద్దేశించిన పేపర్లలో ఫెయిల్‌ చేశారని అభ్యర్థులు వాపోతున్నారు. కరోనా కారణంగా డిపార్ట్‌మెంట్‌ టెస్ట్‌లు నిర్వహించకుండా ఆలస్యం చేసి, ఇప్పుడు నిర్వహించి పాస్‌ కానీయకుండా చేస్తున్నారని గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీపీఎస్సీ తక్షణమే ‘కీ’ విడుదల చేసి సిబ్బందికి న్యాయం చేయాలని, డిపార్ట్‌మెంట్‌ టెస్ట్‌ ఫలితాలతో సంబంధం లేకుండా గ్రామ, వార్డు కార్యదర్శులను రెగ్యులర్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Also Read:Minister Roja: రోజా సహా కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా చేసిన నటీనటులు వీరే..

RELATED ARTICLES

Most Popular