Pawan Kalyan: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఏపీని ప్రభావితం చేయనున్నాయా? ఇక్కడ అనూహ్య పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందా? ముఖ్యంగా బిజెపి వైఖరిలో మార్పు రానుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ను కార్నర్ చేసుకొని రాజకీయాలు నడిచే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాల ఫలితాలు అనుకూలంగా వస్తే ఒకలా.. ప్రతికూలంగా వస్తే మరోలా బిజెపి పావులు కదిపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఏపీలో తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంది. తెలంగాణ ఎన్నికల్లో మాత్రం బిజెపితో కలిసి నడుస్తోంది. టిడిపి న్యూట్రల్ గా ఉంది. ఒకవేళ బిజెపికి అనుకూల ఫలితాలు వస్తే.. ఏపీ విషయంలో బిజెపి పట్టు బిగించే అవకాశం ఉంది. తెలుగుదేశంతో జత కలిసేందుకు వెనుకడుగు వేసే అవకాశం ఉంది. అదే ప్రతికూల ఫలితాలు వస్తే పవన్ ద్వారా టిడిపి కూటమిలోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఏది జరిగినా అది పవన్ ద్వారానే.. జరిగే పరిస్థితి ఉంది. ఈ పరిణామాల క్రమంలో ఏపీ రాజకీయాలు పవన్ కు అనుకూలంగా మారే పరిస్థితి కూడా కనిపిస్తోంది.
రాజస్థాన్, మధ్యప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ గెలుపొందితే మాత్రం ఏపీ విషయంలో అగ్రనాయకత్వం పలుకు చేసుకునే అవకాశం ఉంది. పవన్ విన్నపం మేరకు బిజెపి తెలుగుదేశంతో కలిసేందుకు మొగ్గు చూపినా.. బిజెపి అగ్ర నేతలు మాత్రం మెలిక పెట్టే అవకాశం ఉంది. పవన్ సీఎం అభ్యర్థి అయితేనే తాము ముందుకొస్తామని సంకేతాలు ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ అనుకున్న స్థాయిలో బిజెపికి ఫలితాలు రాకపోతే మాత్రం పవన్ ద్వారా టిడిపికి దగ్గరయ్యే అవకాశం ఉంది. అప్పుడు టిడిపి బిజెపిని కలుపు కెళ్లేందుకు ఒప్పుకోని పరిస్థితి ఉంటుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి.
అయితే పవన్ మాత్రం తెలుగుదేశం పార్టీ లేకుండా వైసీపీని ఓడించడం దాదాపు అసాధ్యమని నిర్ణయానికి వచ్చారు. ఆది నుంచి బిజెపి జనసేనకు మద్దతు ఇచ్చి ఉంటే స్వతంత్రంగా ఎదిగి ఉండేవారమని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. వైసీపీని ఓడించాలంటే తప్పనిసరిగా టిడిపి తో కలవాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. అయితే బిజెపి దేశవ్యాప్తంగా బలోపేతం అయ్యి.. ఐదు రాష్ట్రాల్లో సానుకూల ఫలితాలు వస్తే పవన్ మనసు మారే అవకాశం ఉంది. బిజెపి మద్దతుతో టిడిపి పై ఒత్తిడి పెంచే పరిస్థితి ఉంటుంది. అప్పుడు కచ్చితంగా పవన్ సీఎం అభ్యర్థిత్వం పరిశీలించాల్సిన అనివార్య పరిస్థితి టిడిపి పై పడుతుంది. ఇలా ఎలా చూసినా తాజా రాజకీయ పరిస్థితులు పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా మారుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.