
టీడీపీ అధినేత చంద్రబాబు ఏం మాట్లాడినా చెల్లుతుందని ఇన్నాళ్లు అనుకున్నారు. తన బలమైన మీడియాతో తిమ్మినిబమ్మిని చేయవచ్చని నిరూపించారు కూడా.. కానీ అన్ని రోజులు ఒకలా ఉండవు కదా.. అధికార వైసీపీ అంతకుమించి చంద్రబాబు ఆరోపణలకు ఇరుకునపెడుతూ ముందుకెళుతోంది. తాజాగా చంద్రబాబుకు ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేయడం తీవ్ర కలకలం రేపింది.
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం బండకాడ ఎస్సీ కాలనీకి చెందిన ఓం ప్రతాప్ గత నెల 24న రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి ముందు సీఎంపై మద్యం విధానంపై అసభ్యపదజాలంతో విమర్శిస్తూ వీడియోలో మాట్లాడాడు. ఆ వీడియో వైరల్ కాగా.. ఓం ప్రతాప్ ఆత్మహత్య చేసుకోవడం జిల్లా కలకలం రేపింది.
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ పోలీసులు షాకిచ్చారు. తాజాగా ఆయనకు నోటీసులు పంపారు. చిత్తూరు జిల్లాలో ఓం ప్రతాప్ అనే యువకుడు ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు ఈ నోటీసులను చంద్రబాబుకు పంపినట్టు తెలిసింది.
వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక ఓం ప్రతాప్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని.. ఓం ప్రతాప్ ఆత్మహత్యకు మంత్రి పెద్దిరెడ్డి వర్గమే కారణమని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఈ మేరకు డీజీపీకి లేఖ కూడా రాశారు.
ఈ క్రమంలోనే ఓం ప్రతాప్ మృతి కేసులో చంద్రబాబుకు పోలీసులు నోటీసులు పంపారు. సీఆర్పీఎస్ సెక్షన్ 91 ప్రకారం మదనపల్లె డీఎస్పీ ఈ నోటీసులు జారీ చేశారు. ఓం ప్రతాప్ మృతిపై సాక్ష్యాధారాలు ఉంటే ఇవ్వాలని సదురు నోటీసుల్లో పేర్కొన్నారు.వారంలోగా కార్యాలయానికి హాజరై ఆధారాలు ఇవ్వాలని డీఎస్పీ ఈ నోటీసుల్లో కోరారు.
ఇన్నాళ్లు ఏం ఆరోపించినా చెల్లుతుందని అనుకున్నారు.కానీ తాజాగా ఏ ఆరోపణలు చేసినా నిరూపించాలంటూ ఏపీ పోలీసులు చంద్రబాబుకు నోటీసులు పంపడం సంచలనమవుతోంది. ఇటీవలే డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా చంద్రబాబు ఆరోపణలపై నోటీసు పంపడం గమనార్హం.