కార్యకర్తల ఆందోళనలు.. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు.. చుట్టుముట్టిన పోలీసులు.. లాఠీల దెబ్బలు.. ఆగ్రహజ్వాలలు.. మొత్తంగా టీడీపీ చేపట్టిన ధర్మపరిరక్షణ యాత్ర ఉద్రిక్తతకు దారితీసింది. గురువారం ఉదయం నుంచీ సాయంత్రం దాకా తిరుపతి నగరం అట్టుడికిపోయింది. తెలుగుదేశం పార్టీ చేపట్టిన ధర్మపరిరక్షణ యాత్రకు బుధవారం అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి గురువారం ఉదయానికి తూచ్ అన్నారు. లాఠీలతో అడ్డుకున్నారు. నాయకులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసు స్టేషన్లకు తరలించారు. ధర్మపరిరక్షణ యాత్రలో పాల్గొనడానికి వచ్చిన తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని, మరికొందరు ముఖ్య నాయకులను హోటల్ గడప దాటనివ్వలేదు.
Also Read: కేసీఆర్ నిర్ణయం జగన్ చావుకొచ్చింది.!
ధర్మపరిరక్షణ యాత్రలో పాల్గొనేందుకు కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుంచి తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తిరుపతికి చేరుకున్నారు. ప్రచార రథాలు సిద్ధమయ్యాయి. ర్యాలీ కోసం కార్యకర్తలు ద్విచక్రవాహనాల్లో చేరుకున్నారు. బుద్దా వెంకన్న, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, గౌనివారి శ్రీనివాసులు, దొరబాబు, సుగుణమ్మ, మబ్బు దేవనారాయణ రెడ్డి, బత్యాల చెంగల్రాయులు, ఆర్సీ మునికృష్ణ వంటి నాయకులు అలిపిరిలో కార్యకర్తల ముందు నిలిచారు. మరోవైపు పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బసచేసిన శిల్పారామం సమీపంలోని హోటల్ గ్రాండ్ రిడ్జ్‌ని పోలీసు బలగాలు చుట్టు ముట్టాయి. యాత్రకు బయలు దేరుతున్న అచ్చెన్నాయుడిని బయటకు రానివ్వలేదు. యాత్రకు అనుమతి లేదంటూ ఆయనతోపాటు నిమ్మల రామానాయుడు, పనబాక లక్ష్మి, అమరనాథ రెడ్డి, నాని తదితరులను అడ్డుకున్నారు.
ఎన్టీఆర్ సర్కిల్లో బహిరంగ సభకోసం ఏర్పాటుచేసిన మైకు సెట్లను పోలీసులు తొలగించారు. పసుపు తోరణాలు పీకి పోగేశారు. ఫ్లెక్సీలు విప్పి కుప్పేశారు. ఇది తెలిసి తిరుపతి లోక్‌సభ టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్, దంపూరి భాస్కర్, ఊట్ల సురేంద్ర నాయుడు, బుల్లెట్ రమణ తదితరులు ఎన్టీఆర్ సర్కిల్‌కు చేరుకున్నారు. ర్యాలీకి అనుమతిచ్చి ఎందుకు తీసేశారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నిలదీసిన అందరినీ పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని వ్యానెక్కించారు. ఎమ్మార్‌పల్లె పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల నిర్బంధం మధ్యే అలిపిరి నుంచి తెలుగుదేశం ధర్మపరిరక్షణ యాత్ర ఎన్టీఆర్ సర్కిల్ వైపునకు మొదలైంది. నాయకులు ముందు నడుస్తుండగా కార్యకర్తలు అనుసరించారు. బధిరుల కాలేజీ వద్దే చైతన్యరథాలను, ద్విచక్ర వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రతిఘటిస్తూనే ర్యాలీ ముందుకు కదిలింది.
Also Read: టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్..: పరీక్షలు ఎప్పుడో తెలుసా..?
పోలీసుల నిర్బంధానికి నిరసనగా రుయా సర్కిల్‌లో టీడీపీ యువ కార్యకర్తలు భైఠాయించారు. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తిరుమల ఏఎస్పీ మునిరామయ్య ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. టీఎన్‌ఎస్ఎఫ్ నాయకులు రవినాయుడు, హేమంత్ రాయల్, మక్కీ యాదవ్ తదితరులపై లాఠీలతో వారిపై విరుచుకుపడ్డారు. తరిమి తరిమి కొట్టారు. అటుగా వెళ్తున్న భక్తులు కొందరికీ లాఠీ దెబ్బలు తప్పలేదు. ధర్మపరిరక్షణ యాత్రలో ఉన్నవారికి లాఠీచార్జి సమాచారం అందింది. ఎస్వీఎంసీ సర్కిల్‌వైపు వెళ్తున్న వీరు సుగుణమ్మ ఆధ్వర్యంలో రుయా సర్కిల్ వైపు మళ్లారు. మరికొందరు నాయకులు ఎస్వీఎంసీ సర్కిల్ వద్ద బైఠాయించి పోలీసుల లాఠీచార్జికి నిరసనగా నినాదాలు చేశారు.
మహతి ఎదుట నాయకులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. బుద్దా వెంకన్నను బలవంతంగా వ్యాను ఎక్కించారు. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన నాయకులు వాహనానికి అడ్డుపడ్డారు. ఆందోళనకు దిగిన గౌనివారి శ్రీనివాసులు, రామకృష్ణ, ఆర్సీ మునికృష్ణ, విజయలక్ష్మి, లక్ష్మీప్రసన్నలను కూడా వ్యానులోకి ఎక్కించారు. బలవంతంగా వ్యాను కదిలించారు. అయినా టీడీపీ కార్యకర్తలు అడ్డుగా రోడ్డుపై పడుకున్నారు. వాతావరణం ఉద్రిక్తంగా మారింది. పెద్దఎత్తున పోలీసులను మోహరించి నాయకులను చంద్రగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రుయా సర్కిల్ వద్ద నిరసన తెలుతున్న సుగుణ మ్మ దగ్గరకు నల్లారి కిషోర్ రెడ్డి, మబ్బు దేవనారాయణ రెడ్డి తదితర నాయకులు చేరుకున్నారు. పోలీసుల చర్యలను ఖండించారు. లాఠీఛార్జి చేసిన ఏఎస్పీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. పోలీసుల సూచనలను లెక్కచేయకుండా బైక్ ర్యాలీ, ఎన్టీఆర్ కూడలిలో బహిరంగసభ జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసినందునే ధర్మపరిరక్షణ యాత్రను అడ్డుకుని టీడీపీ నాయకులను అరెస్ట్ చేశామని తిరుపతి ఎస్పీ రమేష్ రెడ్డి చెప్పారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్