
ఆంధ్రప్రదేశ్ వర ప్రదాయినిగా నిర్మితమవుతున్న పోలవరం ప్రాజెక్టులో.. భారీ అవినీతి చోటు చేసుకుంటోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వం కాంట్రాక్టుల పేరుతో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడిందని ఆరోపించిన జగన్.. ఇప్పుడు అంతకు రెట్టింపు చెల్లింపులు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
చంద్రబాబు హయాంలో మొదలైన పోలవరం ప్రాజెక్టు పనులను మొదట ట్రాన్స్ ట్రాయ్ అనే సంస్థ చేపట్టింది. కానీ.. ఆ తర్వాత ఆ కంపెనీ వైదొలిగింది. నవయుగ కంపెనీ లైన్లోకి వచ్చింది. ఈ కంపెనీ రూ.5,535 కోట్లతో పనులు చేస్తోంది. అయితే.. ప్రభుత్వం మారిపోయిన తర్వాత కాంట్రాక్ట్ కంపెనీ కూడా మారిపోయింది.
కాంట్రాక్టు పేరుతో నవయుగ కంపెనీకి చంద్రబాబు భారీగా డబ్బులు ఇప్పించారని ఆరోపిస్తూ.. రివర్స్ టెండరింగ్ కు వెళ్లింది వైసీపీ ప్రభుత్వం. దీంతో.. రూ.780 కోట్ల తక్కువకు టెండర్ దాఖలు చేసింది మేఘా ఇంజనీరింగ్ కంపెనీ. దీంతో.. ఆ సంస్థకే కాంట్రాక్ట్ ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.780 కోట్ల ప్రజాధనాన్ని కాపాడామని చెప్పింది జగన్ సర్కారు.
అయితే.. ఇప్పుడు పోలవరం హెడ్ వర్క్స్ అంచనాలను ఏకంగా రూ.1600 కోట్ల మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది జగన్ సర్కారు. అంటే.. మేఘా కంపెనీకి రూ.780 కోట్లతోపాటు మరో 800 కోట్ల వరకు అదనంగా చెల్లించేందుకు సర్కారు సిద్ధమైందని సమాచారం.
దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నవయుగ కంపెనీ నుంచి రూ.780 కోట్లు రక్షించామని చెప్పిన వారు.. ఇప్పుడు అంతకు రెట్టింపు డబ్బులు మేఘా కంపెనీకి కట్టబెట్టడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు విపక్ష నేతలు. దీనికి ఏం పేరు పెడతారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరి, ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందో?