AP Minister Viswarup: ఏపీ మంత్రి పినిపే విశ్వరూప్ ఆరోగ్యం క్షీణించడంతో ముంబాయి తరలించినట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కానీ ఆయన ఆరోగ్యంపై ప్రభుత్వం కానీ.. కుటుంబసభ్యులు కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. గత కొంతకాలంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో విశ్వరూప్ కనిపించడం లేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం నాడు విశ్వరూప్ బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు. వెంటనే కాకినాడలోని ఓ ఆస్పత్రిలో ప్రాథిమిక వైద్యం అందించి హుటాహుటిన హైదరాబాద్ తరలించారు.

సాధారణంగా మంత్రులు, ప్రముఖులు అనారోగ్యానికి గురైనప్పుడు వెనువెంటనే అపోలో కానీ.. ఏఐజీ ఆస్పత్రిలో చేర్పిస్తారు. కానీ విశ్వరూప్ ను ఓ చిన్న ఆస్పత్రిలోచేర్పించి చేతులు దులుపుకున్నారన్న టాక్ అయితే వినిపిస్తోంది. సిటీ న్యూరో అనే ఆస్పత్రిలో చేర్పించినట్టు తెలుస్తోంది. అయితే అది ఏమంత పెద్ద ఆస్పత్రి కాదు. అక్కడ పెద్ద డాక్టరే యజమాని. కోడి కత్తి దాడి సమయంలో జగన్ అక్కడే వైద్యం చేయించుకున్నారు. ఆ డాక్టరుకే ఇప్పడు ఏపీ ప్రభుత్వంలో చిన్నపాటి నామినెటెడ్ పోస్టు కూడా ఇచ్చాడు. పార్టీ వ్యక్తి అని కాబోలు మంత్రికి అక్కడే చేర్చించారు. ఒకటి రెండు రోజులు అక్కడ వైద్యం అందించి అంతా ఆల్ రైట్ అని మంత్రిని ఇంటికి పంపించినట్టు తెలుస్తోంది. మళ్లీ అస్వస్థతకు గురికావడంతో మంత్రి విశ్వరూప్ ను నేరుగా ముంబాయి తరలించినట్టు తెలుస్తోంది.

ఇటీవల ప్రభుత్వ కార్యక్రమాలకు మంత్రి హాజరు కావడం లేదు. అటు కేబినెట్ సమావేశాలు, పార్టీ రివ్యూల్లో కూడా విశ్వరూప్ కనిపించలేదు. దీంతో అటు మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు ఆయన గురించి వాకబు చేయడం ప్రారంభించారు. తొలుత చిన్న ఆస్పత్రిలో చేర్పించి చేతులుదులుపుకున్నారని.. ఇప్పడు ఆయన ఆరోగ్యం రోజు రోజుకూ క్షీణించడంతో ఉన్నత వైద్యం కోసం ముంబాయి తరలించినట్టు తెలుస్తోంది. అయితే ప్రాథమిక స్థాయి నుంచే మెరుగైన వైద్యం అందించి ఉంటే ఈపాటికే విశ్వరూప్ కొలుకొని ఉండేవారని వైసీపీ ప్రజాప్రతినిధులు అంతర్గత సమావేశాల్లోచర్చించుకుంటున్నారు.