
తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ లు ఎన్నికల్లో గెలిచిన అనంతరం అన్నాదమ్ముల వలే కొద్దిరోజులు కలిసి సాగారు. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెనింగ్ కు ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు. ఇక కేసీఆర్ ఇంటికి రెండు మూడు సార్లు జగన్ వచ్చాడు. ఇంతటి సోదర భావంతో మెలుగుతున్న ఇరు రాష్ట్రాల మధ్య జలవివాదాలు.. ఆర్టీసీ పంచాయితీలు సహా చాలా చుట్టుముట్టాయి. తాజాగా ఈనెల 6న అపెక్స్ కౌన్సిల్ సమావేశం కూడా జరగబోతోంది. కృష్ణా నది నీటి వాటాలపై ఈ పంచాయితీ జరుగుతోంది. అయితే ఈ వివాదాలపై తాజాగా ఏపీ మంత్రి పేర్ని నాని హాట్ కామెంట్స్ చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య పలు వివాదాల పరిష్కారం తమ చేతుల్లో ఏం లేదని.. అంతా కేసీఆర్ చేతుల్లోనే ఉందని ఏపీ మంత్రి పేర్ని నాని ఈ వివాదాలకు మొత్తం కారణం కేసీఆర్ అంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నడపడం.. జలవివాదాల పరిష్కారం గురించి తెలంగాణ సీఎం కేసీఆర్ నే అడగాలని విలేకరుల ప్రశ్నకు మంత్రి పేర్ని నాని సమాధానమిచ్చారు. వివాదాలకు కేసీఆర్ కారణమని పరోక్షంగా నాని బంతిని ఆయనపై నెపం నెట్టేశాడు. ఈ వివాదాలపై ఏపీ నుంచి ఎలాంటి పేజీ లేదన్న మంత్రి పేర్ని నాని వివాదం పరిష్కారం కాకపోవడానికి కారణం కేసీఆర్ సర్కారేనంటూ తనను అడగవద్దని విలేకరుల సమావేశంలో కుండబద్దలు కొట్టడం విశేషం.
పొరుగు రాష్ట్రం తెలంగాణతో ఏపీకి ఉన్న వివాదాల గురించి మంత్రి పేర్ని నాని ఇలా సంచలన వ్యాఖ్యలు చేయడం.. కేసీఆర్ ను టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. కొద్దిరోజులుగా విమర్శలకు పోకుండా కేసీఆర్, జగన్ మౌనంగా ఉంటున్న వేళ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
లాక్ డౌన్ ఆంక్షల సడలింపుతో కేంద్రం బస్సుల అంతర్రాష్ట్ర రవాణాకు అనుమతిచ్చింది. కానీ రెండు రాష్ట్రాల ఆర్టీసీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. చర్చించినా ఫలితం రాలేదు. తెలుగు రాష్ట్రాల మధ్య బస్సుల రాకపోకలపై ప్రతిష్టంభణ తొలగించేందుకు ఇటీవలే రెండు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు హైదరాబాద్ లో సమావేశమైనా అందులో ఏం తేలలేదు. నష్టాల పేరుతో సర్వీసులు తగ్గిస్తామని తెలంగాణ.. బస్సు సర్వీసులు పెంచుతామని ఏపీ ప్రతిపాదిస్తోంది. ఈ క్రమంలోనే రెండు ఆర్టీసీల మధ్య ఈ పంచాయితీ తెగడం లేదు. ఈ పంచాయితీలన్నింటిపై కేసీఆర్ నే అడగాలంటూ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించడం విశేషంగా మారింది.