
మొదటి నుండి లాక్ డౌన్ పొడగింపుకు విముఖంగా ఉంటూ, దానిని రెడ్ జోన్ లకు పరిమితం చేయాలని కోరుతున్న ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారికంగా లోక్ డౌన్ పొడిగుంపును ప్రకటించడానికి ఒక పూట ముందే పౌరుల కదలికలను సులభతరం చేస్తూ ప్రకటించారు. `అత్యవసర’ పనుల నిమిత్తం పోలీసుల నుండి పాస్ లు తీసుకొని రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
దేశమంతా ప్రజా రవాణా పూర్తిగా నిలిచిపోవడంతో ఎక్కడివాళ్లు అక్కడే ఇళ్లకు పరిమితమై ఉండాలని ప్రధానమంత్రి సహా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పదేపదే కోరుతున్నారు. నిత్యవసరాలు, అత్యవసరాలకు తప్ప బయటకు రావొద్దని స్పష్టం చేస్తున్నారు. ఇటువంటి సమయంలో అత్యవసరంగా బయటకు వెళ్లే వారికి సమస్య లేకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
వైద్యం చేయించుకోవడం కోసం, స్వచ్ఛంద సేవ చేసేవాళ్లు, ప్రభుత్వ విధులు నిర్వర్తించే వాళ్లు, ఇతరత్రా సమస్యలతో అత్యవసరంగా ప్రయాణం చేయాల్సిన వారికి కోవిడ్-19 ఎమర్జెన్సీ పాసులను జారీ చేసేందుకు సిద్ధమైంది. అత్యవసరంగా ప్రయాణాలు చేయాల్సిన వాళ్లు ఇబ్బందులు పడకుండా పాసులు జారీ చేయాలని ప్రభుత్వం సూచించినట్లు ఏపీ డీజీపీ ఆఫీస్ వెల్లడించింది.
పాసులు అవసరమైనవారు.. పేరు, అడ్రస్, ఆధార్ కార్డు, వారు ప్రయాణించే వాహనం నంబర్, ప్రయాణికుల సంఖ్య, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలనే వివరాలను అందజేస్తే జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి పాస్ జారీ అవుతుందని తెలిపింది. ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చి పాస్ కోసం ప్రయత్నిస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీసు శాఖ హెచ్చరించింది.
పాస్ ల కోసం వివరాలను పంపి దరఖాస్తు చేసుకోవాల్సిన జిల్లా ఎస్పీల వాట్సాప్ నెంబర్లు, మెయిల్ ఐడీల వివరాలను వెల్లడించింది. ప్రయాణించేటప్పుడు గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలని, ఎస్పీ వాట్సాప్ నెంబర్ లేదా మెయిల్ ఐడీ నుంచి వచ్చిన పాసులు మాత్రమే చెల్లుబాటు అవుతాయని, ఫార్వార్డ్ చేసుకుని ఇతరులు వాడుకునేందుకు వీలుకాదని స్పష్టం చేసింది.
ఈ విధంగా ఈ పాస్ లకు గేట్లు తెరిచింది. లాక్ డౌన్ ఉధృతంగా అమలులో ఉన్నప్పుడే అధికార పక్ష నాయకులు విచ్చలవిడిగా తిరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు వారికి సన్నిహితంగా ఉన్నవారందరూ పాస్ లు పొంది రాజమార్గంలో ప్రయాణం చేసే అవకాశం లభిస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు.