
AP Legislative Council: గత ఎన్నికల్లో అంతులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన జగన్ కు శాసనమండలిలో ఎదురవుతున్న పరాభావాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మొన్నటికి మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దారుణ పరాభావం ఎదురైంది. సొంత ప్రాంతం రాయలసీమలో సైతం పట్టభద్రులు తిరస్కరించారు. తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం ఓటమే ఎదురైంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలే జగన్ ను తిరస్కరించారు. వైసీపీ అభ్యర్థిని ఓడించారు. వైసీపీకి చెందిన నలుగురు అభ్యర్థులు క్రాష్ ఓటింగ్ కు పాల్పడ్డారు. అధినేతను ధిక్కరించి ఇద్దరు.. లోపయికారీగా ఇద్దరు టీడీపీ అభ్యర్థికి మద్దతు పలికారు. వైసీపీ సర్కారుకు రాజకీయంగా దెబ్బకొట్టారు.
మూడు రాజధానుల బిల్లుకు బ్రేక్…
అసలు శాసనమండలి అంటేనే జగన్ బెంబేలెత్తిపోతున్నారు. 151 ఎమ్మెల్యేలతో అధికారంలోకి వచ్చిన జగన్ శాసనమండలిలో వైసీపీకి ఆధిక్యం లేకపోవడాన్ని తట్టుకోలేకపోయారు అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే మూడు రాజధానుల బిల్లు శాసనమండలిలో తిరస్కరణకు గురైంది. దీంతో ఏకంగా శాసనమండలి రద్దుకే జగన్ డిసైడయ్యారు.అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపారు. కానీ మండలిలో వైసీపీకి పూర్తి మెజార్టీ వచ్చిన తరువాత మనసు మార్చుకున్నారు. శాసనమండలిలో తన పార్టీ ఎమ్మెల్సీలతో నింపేయ్యాలని భావించారు. పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాలను సైతం విడిచిపెట్టలేదు. అయితే పట్టభద్రుల స్థానాలను పోగొట్టుకొని ప్రజా వ్యతిరేకత ఉందన్న సంకేతాలను మూటగట్టుకున్నారు. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేల విశ్వాసం పొందలేక ఒక ఎమ్మెల్సీ స్థానంలో దారుణ పరాభావాన్ని మూటగట్టుకున్నారు.
ముమ్మాటికీ తప్పటడుగే…
రాష్ట్రంలో విపక్షాలు బలపడకుండా చేయాలన్న ప్రయత్నంలో జగన్ తప్పటడుగులు వేశారు. గత ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు అంతులేని విజయాన్ని ఇచ్చారు. మొత్తం 151 స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది. నలుగురు టీడీపీ సభ్యులతో పాటు మరో జనసే ఎమ్మెల్యే వైసీపీలోకి ఫిరాయించారు. శాసనసభలో వైసీపీ బలం 156 ఎమ్మెల్యేలకు పెరిగింది. శాసనమండలిలో సైతం సంపూర్ణ మెజార్టీ దక్కింది. ఇటువంటి సమయంలో ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వచ్చింది. పట్టభద్రులు, ఉపాధ్యాయ, స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీలను ఎన్నిక జరుగుతోంది. అయితే ఇందులో స్థానిక సంస్థల స్థానాల్లోవైసీపీకి బలం ఉంది కాబట్టి పోటీచేయవచ్చు. అయితే పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాలు మాత్రం ఎప్పుడూ పీడీఎఫ్ సభ్యులే ప్రాతినిధ్యం వహించేవారు. అయితే అవి కూడా వైసీపీ ఖాతాలో పడాలని జగన్ ప్లాన్ చేశారు. విపరీతమైన ప్రజావ్యతిరేకత ఉన్న సమయంలో పోటీకి దిగారు. కానీ చావు తప్పి కన్నులొట్టపోయిన విధంగా ఉపాధ్యాయ స్థానాల్లో గెలుపొందారు. కీలకమైన పట్టభద్రుల స్థానాల్లో మాత్రం ఓటమి చవిచూశారు. రాజకీయ ప్రతికూల పరిస్థితులను చేజేతులా మూటగట్టుకున్నారు.

మూల్యం చెల్లించుకున్న జగన్..
అయితే నాడే శాసనమండలి రద్దుచేసి ఉంటే జగన్ కు ఈ సంకట పరిస్థితి ఉండేది కాదు. అసలు శాసనమండలి అనేది వేస్ట్. దీనికి ఏడాదికి రూ.60 కోట్లు ఖర్చు చేయడం దండగ. అంటూ తొలుత చెప్పుకొచ్చిన జగన్ తరువాత మాట మార్చారు. ఇప్పుడు వరుసగా పలకరించిన ఓటములతో చేతులు కాల్చుకున్నారు. సాధారణ ఎన్నికల్లో ప్రభావం చూపేలా మూల్యం చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే కోటా కింద జరిగిన ఎన్నికల్లో వైసీపీని అనూహ్యంగా దెబ్బకొట్టిన టీడీపీ.. ప్రస్తుతం సంబరాల్లో మునిగిపోయింది. ఇకపై ఏ ఎన్నిక జరిగినా.. విజయం టీడీపీదే అని ఆ పార్టీ నేతలు ప్రకటించుకుంటున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. గతంలో మూడు రాజధానుల బిల్లు విషయంలో సీఎం జగన్కు టీడీపి శాసనమండలి ద్వారా షాక్ ఇవ్వగా.. తాజాగా శాసనమండలి ఎన్నికల్లోనే మరోసారి టీడీపీ వైఎస్ జగన్ను రాజకీయంగా దెబ్బకొట్టింది. దీంతో సాధారణ ఎన్నికల్లో తిరుగులేని విజయంతో శాసనసభలో మెజార్టీ సాధించిన వైఎస్ జగన్కు మరోసారి శాసనమండలి కలిసిరాలేదనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చనీయాంశంగా మారింది.