Speaker Thammineni Sitaram: ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంకు వర్గ పోరు తప్పడం లేదు. వైసీపీ శ్రేణులు వీధి పోరాటానికి దిగుతున్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలో వైసీపీలో మూడు వర్గాలు కొనసాగుతున్నాయి. తమ్మినేని ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తుండగా.. మాజీ ఎంపీపీ సువారి గాంధీ, ప్రొఫెసర్ చింతాడ రవి వర్గాలు కొనసాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎవరికి వారే తమకు సీటని చెబుతున్నారు. తమ్మినేనికి సీటు ఇస్తే ఓడిస్తామని చెబుతున్నారు.
గత ఎన్నికల్లో తమ్మినేని సీతారాం విజయానికి అందరూ సమిష్టిగా కృషి చేశారు. దీంతో ఆయన గెలుపు సునాయాసమైంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ద్వితీయ శ్రేణి నాయకులను తమ్మినేని అణచివేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో నియోజకవర్గంలోని ఐదు మండలాల నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎవరికి వారే ఆశావహులుగా మారిపోయారు. ఒకరంటే ఒకరికి గట్టిన పరిస్థితి. దీంతో హై కమాండ్ కు తలనొప్పిగా మారింది.
తాజాగా ఓ ఘటనలో రెండు వర్గాల వారు నడిరోడ్డుపైనే కొట్టుకున్నారు. ఈ ఘటనలో 8 మంది వైసీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇటీవల ఓ వర్గ నాయకుడు సువ్వారి గాంధీ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ నేపథ్యంలో గాంధీ, చింతాడ రవికుమార్ వర్గాల మధ్య సోషల్ మీడియాలో వార్ నడిచింది. ముందుగా రవికుమార్ వర్గీయులు దాడికి దిగారు. దీనికి స్పందించిన గాంధీ వర్గీయులు కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన ఎనిమిది మందికి తీవ్ర గాయాలు తగిలాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఆ ప్రాంతంలో పోలీస్ పికేట్ ఏర్పాటు చేశారు.
వచ్చే ఎన్నికల్లో తమ్మినేని సీతారాం టికెట్ ఇస్తే ఏ వర్గము పనిచేసే అవకాశం లేదు. అంతలా పరిస్థితి మారిపోయింది. అదే సమయంలో టిడిపి ఇంచార్జ్ కూన రవికుమార్ గట్టిగానే పనిచేస్తున్నారు. టిడిపిలో ఎటువంటి వర్గ విభేదాలకు అవకాశం లేదు. వైసీపీలో చూస్తే మూడు వర్గాలు కొనసాగుతున్నాయి. ఒకరికి టికెట్ ఇస్తే మరొకరు సహకరించని దుస్థితి. దీనికి తోడు తమ్మినేని తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. దీంతో ఆమదాలవలస వైసిపి లో జరుగుతున్న పరిణామాలు అధినాయకత్వానికి మింగుడు పడడం లేదు.