ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఎంత దీనస్థితిలో ఉందో అందరం చూస్తూనే ఉన్నాం. సమయానికి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. అయితే ఇప్పుడు తీసుకున్న అప్పులు చాలట్లేదు అన్నట్లు ఏపీ ప్రభుత్వం మళ్ళీ కొత్తగా అప్పులు చేస్తోంది. ఇక అప్పులు చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్టం ఒక్క రోజు కూడా ముందడుగు వేసే పరిస్థితి లేదు. అంత దీనావస్థకి వచ్చేశాం.
ఏపీ రాష్ట్రానికి దశాబ్దాలుగా అప్పులు చేసి పూట గడపడం అలవాటే. చంద్రబాబు, వైయస్సార్ మా ర్చిమార్చి ఇలా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకున్న వారే. ఒకానొక సమయంలో ప్రపంచ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ కు మేము మీకు ఇక అప్పులు ఇవ్వలేము బాబోయ్ అంటూ చేతులెత్తేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక గతంలో చంద్రబాబు చేస్తున్న అప్పుల పై ఆరోపణలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వచ్చాక బాబుని తలదన్నే రీతిలో అప్పులు చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక ఈ స్థాయిలో అప్పులు చేస్తే రాష్ట్రం గతి తప్పడం అనివార్యం అని ఐవైఆర్ కృష్ణారావు తదితర మాజీ ఐఏఎస్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం మాత్రం తమ తీరు మార్చుకోవట్లేదు లేదు సరికదా కొత్త అప్పులు చేసేందుకు వెతుకుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ ఏడాది ఎఫ్ఆర్బీఏం పరిమితిని దాదాపుగా దాటేసి చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిమితిని సవరించుకుంటే కొత్త అప్పులు వస్తాయి అన్న కోణంలో ఇప్పుడు అడుగులు వేస్తోంది. తొలుత ఆర్డినెన్స్ జారీ చేసి గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత ఆ ఆర్డినెన్స్ ను కేంద్రానికి ఫార్వర్డ్ చేసి అక్కడి నుండి ఆమోదముద్ర వేసుకోవలసి ఉంది. ఆ దిశగా కసరత్తులు ఇప్పటికే మొదలయ్యాయి. ఇదే కనుక జరిగితే ఏపీ ప్రభుత్వం మరో 20 వేల కోట్ల రూపాయల అరువు తెచ్చుకుంటుంది.
సరే ఈ అప్పులు తీసుకుని వచ్చి ఇండస్ట్రీలు ఏమన్నా పెడుతున్నారా? కంపెనీల్లో ఏమైనా పెట్టుబడులు పెడుతున్నారా? ఉపాధి కల్పించే కార్యక్రమాలు ఏమైనా చేపడుతున్నారా? ఊరికే ప్రజల ఖాతాల్లోకి నవరత్నాల పేరిట జమ చేస్తున్నారు. ఇప్పటివరకూ ఒక్క ఇన్వెస్టర్ రాష్ట్రానికి వచ్చిన పాపాన పోలేదు. ఉద్యోగావకాశాలు కల్పించడం లేదు. అభివృద్ధి చేసే ఆలోచనే లేదు కానీ అప్పులు మాత్రం చిటెకలో చేసేస్తారు. 2014 నుంచి 2019 వరకు చేసిన అప్పులకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత వహిస్తారా? మరి 2024 లోపల తీసుకుంటున్న అప్పులకి జగన్ నేనే బాధ్యుడిని అని చేతులు కట్టుకుని నిలబడతారా? అప్పుల భారం చివరిగా మోయాల్సింది కూడా భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలే..! అభివృద్ధిలో అడ్రస్ గల్లంతు అవుతున్నా మాత్రం ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉంది. ఇక జగన్ రాకతో రాష్ట్ర ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది.