AP Incidents: ఏపీలో గతంలో ఎన్నడూ లేని పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏ విషాద వార్త బయటకు వస్తుందోనన్న భయం వెంటాడుతోంది. ఇంటి నుంచి అడుగు బయటపెట్టిన ఆడబిడ్డ ఇంటికి తిరిగి క్షేమంగా చేరుతుందా లేదా అన్న అనుమానం సగటు తల్లిదండ్రుల్లో నెలకొంటోంది. కామాంధులు, పరిచయస్తులు, ప్రేమికుడు, దగ్గరి బంధువు… ఎవరి రూపంలో మృగాడు దాగి ఉన్నాడో తెలియని భయం. లైంగికదాడులకు పాల్పడటం.. ప్రేమించలేదని కత్తి దూయడం.. అఘాయిత్యాలకు పాల్పడం.. రాష్ట్రంలో జరుగుతున్న ఇలాంటి ఘటనలు ఆడబిడ్డల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. దిశ చట్టం గురించి ప్రభుత్వం ఎన్ని గొప్పలు చెప్పుకొన్నా రాష్ట్రంలో కీచక పర్వాలు ఆగడం లేదు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో మానసిక స్థితి సరిగా లేని ఓ యువతిని 36 గంటల పాటు బంధించి ముగ్గురు మృగాళ్లు అత్యాచారానికి పాల్పడితే పోలీసులు పట్టించుకున్న పాపాన పోలేదు. బాధితురాలి కుటుంబ సభ్యులే వెతికి కామాంధుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించాల్సిన దుస్థితి నెలకొంది. నెలన్నర క్రితం కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ప్రియుడితో కలిసి సముద్రతీరానికి వెళ్లిన యువతిపై మందుబాబులు లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేసే వరకూ విషయం బయటికి రాలేదు.నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ప్రేమించలేదని చెంచు కృష్ణ అనే ఉన్మాది ఓ బాలిక గొంతు కోశాడు. మరో ఘటనలో మహిళతో సహజీవనం చేస్తున్న సురేశ్ అనే వ్యక్తి ఆమె కుమార్తెపై పలుమార్లు లైంగికదాడి చేశాడు. ఆ బాలిక గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన నరేశ్ అనేవ్యక్తి కూతురు లాంటి బాలికపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడి గర్భవతిని చేశాడు. ఇలా వెలుగులోకి వచ్చినవి కొన్నే.

బాధితులకేదీ స్వాంతన
అత్యాచార ఘటనలు రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకుంటున్నారు. ఇటీవల విజయవాడ ఘటనకు సంబంధించి సాగిన ఎపిసోడ్ జుగుప్సాకరంగా ఉంది. బాధితురాలి పరామర్శకు విపక్ష నేత చంద్రబాబు వెళ్లినప్పుడు జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వ్యవహార శైలి కూడా విమర్శలకు దారి తీసింది. బాధితురాలిని పరామర్శించడం ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు విధి. ఆ సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. అయితే దానిపై వైసీపీ నాయకులో, మంత్రులో, సలహాదారులో స్పందించి ఉంటే బాగుండేది. కానీ అక్కడే ఉన్న వాసిరెడ్డి పద్మ ప్రభుత్వం తరుపున వాకల్తా పుచ్చుకున్నారు. నేరుగా చంద్రబాబుతోనే వాదనకు దిగారు. అంతటితో ఆగకుండా ప్రధాన ప్రతిపక్ష నేతకు నోటీసులు జారీచేశారు. మహిళా కమిషన్ ముందు హాజరుకావాలని ఆదేశించారు. దీంతో బాధితురాలి అంశం మరుగునపడిపోయింది. మీడియాకు అదే హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇటువంటి వాటి విషయంలో ప్రభుత్వాలు, ప్రధాన ప్రతిపక్షాలు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరముంది.
Also Read: Vijayasai Reddy: విజయసాయిరెడ్డికి మెడకు చుట్టుకున్న జాబ్ మేళాల వివాదం.. సజ్జలకు వివరణ ఇచ్చిన వైనం
జాడలేని ‘దిశ’

రెండేళ్ల క్రితం అసెంబ్లీలో ఆమోదించిన ‘దిశ’ చట్టమే లేకున్నా వైసీపీ ప్రభుత్వం మాత్రం ఈ పేరుతో హడావుడి చేస్తూనే ఉంది. దేశంలో ఏ ప్రభుత్వం ఇటువంటి చట్టం చేయడానికి సాహసించలేదని సీఎం జగన్ ప్రకటించారు. ఇప్పటికీ అన్ని వేదికలపై ఇదే మాటను చెప్పుకొస్తున్నారు. అయితే ఏపీ అసెంబ్లీ పంపిన దిశ బిల్లు గురించి పార్లమెంట్లో ప్రస్తావించిన వైసీపీ ఎంపీకి చుక్కెదురయ్యింది. సవరణ బిల్లు వైసీపీ ప్రభుత్వం తిరిగి పంపలేదని కేంద్రమంత్రి బదులిచ్చారు. అది చట్టమే కాదని, కేవలం యాప్ మాత్రమేనని నాలుగు నెలల క్రితం పోలీస్ బాస్ స్పష్టంచేశారు.
చట్టం లేకుండానే ముగ్గురికి ఉరిశిక్ష పడినట్లు గత హోంమంత్రి ఆర్భాటంగా ప్రకటించేశారు. తాజాగా గుంటూరు ప్రత్యేక కోర్టు రమ్య హంతకుడికి ఉరిశిక్ష విధించడంతో, ఇది తమ ఘనతే అన్నట్టు అధికార నేతలు చెప్పుకొంటున్నారు. కనిపించిన ప్రతి ఒక్కరినీ పోలీసులు ఆపి దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. పురుషులనూ వదలడం లేదు. దిశ పేరిట ప్రభుత్వం చెబుతున్న భాష్యం మహిళల్ని రక్షించలేక పోతోంది. మృగాళ్లను భయపెట్టలేక పోతోంది. యాప్ పేరుతో ఆడబిడ్డలను మభ్య పెడుతోంది. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే 21 రోజల్లో ఉరి శిక్ష తప్పదని అసెంబ్లీ సాక్షిగా జగన్ హెచ్చరించినా ఇప్పటి వరకూ ఒక్కరికీ శిక్ష పడలేదు. దిశ చట్టం అమల్లోకి వచ్చిన తరువాతే ఎక్కువ అఘాయిత్యాలు జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
ఆందోళనకు గురిచేస్తున్న గణాంకాలు
ఏపీలో మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు పెరిగాయని గతేడాది జాతీయ నేర గణాంకాల నివేదిక(ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించింది. రాష్ట్రంలో 2019లో ఈ తరహా ఘటనలు 1,892 నమోదు కాగా, 2020లో 2,942 కేసులు పోలీసు రికార్డుల్లో ఉన్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా మహిళలపై జరిగిన నేరాల్లో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ ముందు వరుసలో ఉందని, మహిళల్ని రహస్యంగా చిత్రీకరించడంలో రెండో స్థానంలో ఉందని వెల్లడించింది. మహిళల్ని వేధించిన ఘటనల్లో మహారాష్ట్ర, తెలంగాణ తర్వాత ఏపీ మూడో స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన అన్ని నేరాల్లో మహిళలపై దాడులు ఎక్కువగా ఉన్నట్టు 2021 డిసెంబరులో అప్పటి డీజీపీ సవాంగ్ చెప్పారు. గతంతో పోలిస్తే మహిళలపై వేధింపులు ఏకంగా 49.04 శాతం పెరిగినట్టు వెల్లడించారు. మహిళలపై అన్నిరకాల నేరాలు 2020 కన్నా 2021లో 21శాతం పెరిగినట్లు వివరించారు.
[…] […]