ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాకరంగా తీసుకున్న రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించడాన్ని రాష్ట్ర హైకోర్ట్ కొట్టివేయడంతో రాజకీయంగా ఆయనకే కాకుండా, రాష్ట్ర గవర్నర్ బిస్వభూషన్ హరిచందన్ కు సహితం పెద్ద ఎదురు దెబ్బగా పరిశీలకులు భావిస్తున్నారు. హడావుడిగా ప్రభుత్వం పంపిన ఆర్డినెన్సు పై గవర్నర్ సంతకం చేయడం ఈ మొత్తం వ్యవహారానికి మూలం కావడం గమనార్హం.
రమేష్ కుమార్ పదవీకాలం తగ్గించే దిశలో జారీచేసిన ఆర్డినెన్సు చెల్లదని, రాజ్యాంగ విరుద్ధమని మాత్రమే కాకుండా, అటువంటి ఆర్డినెన్సు జారీచేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్ట్ స్పష్టం చేయడం గమనార్హం. నేరుగా గవర్నర్ చర్యను ప్రశ్నించక పోయినప్పటికీ హడావుడిగా ఆర్డినెన్సు పై సంతకం చేసిన గవర్నర్ సహితం అందుకు బాధ్యత వహించవలసి ఉంటుంది.
ఒడిశాలో సీనియర్ బిజెపి నేత అయిన గవర్నర్ కనీసం న్యాయ అభిప్రాయం కూడా కోరకుండా రాజకీయ కారణాలచేతనే నిముషాలలో సంతకం చేశారనే విమర్శలు అప్పట్లోనే చెలరేగాయి. ఉదయం వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రివర్గం నుండి ఎటువంటి చర్చ లేకుండా అనుమతి పొందిన ముఖ్యమంత్రి వెంటనే గవర్నర్ సంతకం కోసం ఫైల్ పంపారు. అయన సహితం ఎటువంటి ప్రశ్నలు అడగకుండానే సంతకం చేశారు.
ఈ మొత్తం వ్యవహారం అంతా రెండు, మూడు గంటల వ్యవధిలో జరిగింది. ఎన్నికల కమీషన్ నిర్మాణంలో ఇటువంటి కీలక మార్పులు తీసుకురావాలనే అంతకు ముందు మరెక్కడా ఎటువంటి చర్చ జరిగిన ఉదంతం కూడా లేదు. అటువంటప్పుడు గవర్నర్ కనీస పరిశీలన చేయకుండా సంతకం చేయడం పలు విమర్శలకు దారితీసింది.
అయితే జగన్ కు కొందరు బిజెపి నేతలతో ఉన్న అనుబంధంతోనే ఈ విధంగా జరిగినదని విమర్శలు సహితం వినవస్తున్నాయి. సీనియర్ బిజెపి నేతల ప్రోద్బలం కారణంగానే గవర్నర్ ఆ విధంగా సంతకం చేసి ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు.
క్రియాశీల రాజకీయాల నుండి గవర్నర్ పదవిలోకి వచ్చాకా రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని మనం కోరుకొంటున్నా ఆచరణలో సాధ్యం కావడం లేదని ఈ ఉదంతం మరోమారు స్పష్టం చేస్తుంది.