
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం గందరగోళంగా మారింది. పాలనా వ్యవహారంతో రాజకీయ పార్టీల అవసరాలను ముడి పెట్టే విధంగా జగన్ తీసుకున్న నిర్ణయానికి ఇప్పుడు ఒక్కసారిగా ఏపీ రాజకీయ సారూప్యత అంతా మారిపోయింది. గవర్నర్ నుంచి ఆమోదం వచ్చిన తర్వాత కూడా ఏపీ రాజధాని మార్పు సమస్య పరిష్కారం కాలేదు…. అంటే అసలు జగన్ తీసుకున్న నిర్ణయం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న ఇపుడు ప్రజల్లో నెమ్మదిగా కలగడం మొదలైంది.
ఏదైనా నిర్ణయం తీసుకుని దానిలో నిజంగా పక్షపాతం లేని ఉద్దేశం ఉంటే అది అమలు కావడానికి ఎంతో సమయం పట్టదు అన్నది ఎప్పటినుండో చరిత్ర మనకు చెబుతున్న మాట. ప్రస్తుతం న్యాయ చిక్కుల్లో ఇరుక్కున్న ఏపీ మూడు రాజధానులు విషయం తాజాగా విచారణకు వచ్చి జగన్ కు హై కోర్టు మరో షాక్ ఇచ్చింది.
వివరాల్లోకి వెళితే… ఏపీ రాజధాని తరలింపు పై ‘స్టేటస్ కో’ ఇచ్చిన హైకోర్టు ఈ నెల 27 వరకు దానిని పొడిగించి ఏపీ సర్కార్ ను… రాజధాని మార్పు అత్యవసరతను మరొకసారి సమీక్షించుకోమని ఇన్ డైరెక్ట్ గా చెప్పింది. కేసు వాయిదా వేయడం కానీ స్టేటస్ కో పొడిగించవద్దని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరిన తర్వాత కూడా హైకోర్టు అందుకు అంగీకరించకుండా స్టేటస్ కో ను పొడిగించడం గమనార్హం. ఈ పరిణామం రాజధాని తరలింపు పై జగన్ సర్కార్ కు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు.
అసలు గట్టిగా మాట్లాడితే ఈ కరోనా సమయంలో రాజధాని మార్చేంత ఎమర్జెన్సీ ఏముందని హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణ ను ఆగస్టు 27కు వాయిదా వేసింది. ఈ విచారణలు…. వాదోపవాదాలు పూర్తయ్యేసరికి కనీసం మరో రెండు నెలలు అయినా పడుతుంది.. ఇక అప్పటి వరకూ జగన్ రాజధానిని అమరావతి నుండి తరలించే అవకాశం అయితే లేదు. ప్రస్తుతానికైతే రాజధానిపై యథాతథ స్థితి కొనసాగాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. మరి జగన్ ప్రభుత్వం… కోర్టు వారి ఆదేశాలను బేఖాతరు చేస్తుందా.. లేక ఈ సారి మాత్రం రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటుందా అన్న విషయం వేచి చూడాలి.