దొంగతనం చేసినా.. ఎవరికీ దొరకొద్దు అంటారు. సరిగా చంద్రబాబు విషయంలో అదే జరుగుతోంది. చంద్రబాబు అవినీతిపై విచారణ జరపడం ఎవరికీ సాధ్యపడే విషయం కాదనేది మరోసారి రుజువైంది. ప్రజాకోర్టులో చంద్రబాబు పరపతి పాతాళంలోకి పడిపోయినా, అదొక్క చోట తిరుగులేని పట్టు నిలుపుకున్నారు. చంద్రబాబుపై కేసులు గట్రా జగన్ ప్రభుత్వం ఎన్ని ఫైల్ చేసినా.. ఆయన్ను ఏం చేసుకోలేమని అధికార పార్టీ నేతలే ఒప్పుకుంటున్నారు.
అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి అసైన్డ్ భూముల బదలాయింపు వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి పొంగూరు నారాయణలపై సీఐడీ నమోదు చేసింది. ఈ నెల 23న విచారణకు రావాలని సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.‘మీకెంత ధైర్యం.. చంద్రబాబునే విచారించాలని అనుకుంటారా. ఆశ దోష అప్పడం.’ అంటూ టీడీపీ శ్రేణులు వ్యంగ్యంగా చెబుతూ వచ్చాయి. చివరికి అదే నిజమైంది. ఆ కేసు కాస్త విచారణలో దశలోనే ఆగిపోయింది. ఈ మాత్రం దానికి జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందనే చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. తనపై కేసులేస్తే బాబు ఏం చేస్తారో అందరికీ తెలుసు. గతంలో చంద్రబాబుపై లక్ష్మిపార్వతి వేసిన కేసుల సంగతి ఏమైంది..? అంతెందుకు ఓటుకు నోటు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా వాయిస్ రికార్డ్‌తో పట్టుబడిన చంద్రబాబును ఎవరేం చేశారు?
ఎప్పటిలాగే చంద్రబాబుకు కేసు విచారణకు వెళ్లకుండానే ఊరట లభించింది. ప్రతి మనిషికి ఏదో ఒక ఆశ, ఊరటనిచ్చే ఘటనలే ముందుకు నడిపిస్తాయి. ప్రజాకోర్టులో చంద్రబాబు పని సమాప్తమైందనే అభిప్రాయాలు విస్తృతంగా ప్రచారమవుతున్న వేళ.. ఆయనకు మరో వేదికపై సాంత్వన లేకపోతే ముందుకు సాగేది ఎలా? అందుకే చంద్రబాబుకు నిన్న లభించిన ఊరట ఎవరికీ పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. కానీ.. అసైన్డ్ భూముల వ్యవహారంలో చంద్రబాబు నిస్సహాయుల భూములను చౌకగా కొన్నారనే వాస్తవం మాత్రం జనాల్లోకి బలంగా వెళ్లింది. కొన్ని వ్యవస్థల్లో తనకున్న పట్టుతో విచారణ జరగకుండా, శిక్ష నుంచి చంద్రబాబు తప్పించుకుంటున్నారనే అభిప్రాయాలు బలంగా ఉన్నాయి.
అయితే.. ఇదే బాబుకు ఎన్నికల క్షేత్రంలో వ్యతిరేకతను తీసుకొచ్చే ప్రమాదం లేకపోలేదు. బహుశా జగన్ సర్కార్ ఉద్దేశం కూడా చంద్రబాబుపై దళితులు, అణగారిన వర్గాల్లో వ్యతిరేకత పెంచడానికి సీఐడీ కేసు దోహదపడుతుందని భావించి ఉండొచ్చు. చంద్రబాబు న్యాయవ్యవస్థల నుంచి తప్పించుకున్నా ప్రజా కోర్టు నుంచి తప్పించుకోలేరనే అభిప్రాయాన్ని వైసీపీ నేతలు వెల్లడిస్తున్నారు. కొన్ని చోట్ల తన ఇమేజీ వాడుకుంటూ లబ్ధిపొందుతున్నా.. అది అన్ని సందర్భాల్లో పనికిరాదని అంటున్నారు.