మూడు రాజధానుల వ్యవహారంపై ప్రభుత్వం పకడ్బందీగానే ముందుకు వెళుతోంది.. ఎప్పటికప్పుడు మరిచిపోకుండా దానిపై ప్రకటనలు చేస్తూనే ఉంది. తాజాగా వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డి, సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటనలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గత కొన్ని రోజులుగా రాజధానుల వ్యవహారం గురించి ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇక ఈ వ్యవహారం అటకెక్కినట్లే అని అందరు అనుకున్నారు. దానికి తోడు అమరావతి డెవలప్ మెంట్ అథారిటీపై ముఖ్యమంత్రి సమీక్షలు సైతం నిర్వహించారు. దీంతో తరలింపును తాత్కాలికంగా వాయిదా వేశారేమోనని భావించారు. కానీ విజయసాయిరెడ్డి, బొత్స ప్రకటనలతో ఈ వ్యవహారం పక్కన పెట్టలేదనే విషయం స్పష్టమైంది.
అమరావతి నుంచి రాజధానిని మార్చితే రాష్ర్టవ్యాప్తంగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని వైసీపీ భావించినా తరువాత రాకపోవడంతో ఒక అంచనాకు వచ్చారు. కేవలం 29 గ్రామాల ప్రజలు మాత్రమే వ్యతిేకించారు.దీంతో వారిని గురించి పట్టించుకోలేదు. అందుకే మూడు ప్రాంతాలను సంతృప్తి పరిచే విధంగా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలకు సమ ప్రాధాన్యం ఇచ్చేందుకు మూడు రాజధానుల ప్రకటన చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో మూడు రాజధానులపై వెనక్కి తగ్గితే పరువు పోతుందని భావించి ముందుకు నడిచేందుకే సర్కారు నిర్ణయించింది.
విశాఖప్నంలో కార్యనిర్వాహక రాజధానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు ఒకేసారి తరలించకుండా క్రమంగా తీసుకెళ్లాలని యోచిస్తున్నారు. ఫిషరీస్,టూరిజం, ఇండస్ర్టీస్, మైనింగ్ వంటి కార్యాలయాలు తొలిదశలో తరలించనున్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంతో అని్న పనులు అక్కడి నుంచే చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో విశాఖలో కార్యాలయాల ఏర్పాట్లు సాగుతున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి.
కోర్టు పరిధిలోని అంశాపై మాట్లాడరాదని తెలిసినా విజయసాయిరెడ్డి, బొత్స వ్యాఖ్యానాలు చేయడంతో అందరి దృష్టి వారిపై పడింది. కానీ వారు మాట్లాడిన మాటలు కోర్టు పరిధిలోకి రావు. దీంతో వారు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని మార్చుకోవడానికే ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పడంతో అది కోర్టు పరిధిలోని అంశం కాదు. సీఆర్టీఏ చట్టం రద్దు, మూడు రాజధానుల బిల్లులను న్యాయస్థానం పరిశీలిస్తోంది.