
ఇవాళ తారీఖు మూడు. కానీ.. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ లోని ఉద్యోగులందరికీ జీతం అందలేదు. పెన్షనర్లకు అసలే అందలేదు. అందుబాటులో ఉన్నంత డబ్బును ఉద్యోగుల అకౌంట్లలో జమ చేస్తున్నారు. ప్రతి నెలా ఇదే పరిస్థితి నెలకొన్నప్పటికీ.. ఈ సారి ఇంకాస్త ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణమని అంటున్నారు.
ప్రతీ మంగళవారం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రెండు వేల కోట్ల రూపాయల రుణం తీసుకుంటోంది ఏపీ సర్కారు. బాండ్లు వేలం వేసి ఈ రుణాలను సమీకరిస్తోంది. వడ్డీ రేటు ఎక్కువగానే ఉన్నప్పటికీ.. ఖజానా ఖాళీఅవడంతో ఏపీకి అనివార్య పరిస్థితి ఏర్పడుతోంది. అయితే.. ఈ వారం రావాల్సిన అప్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ విషయం గురించే ఢిల్లీ వెళ్లిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. అప్పు సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
తాజాగా.. ఏపీ సర్కారు రుణ పరిమితిని కేంద్ర ప్రభుత్వం బాగా తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.42,472 కోట్ల బహిరంగ మార్కెట్ రుణం తీసుకునేట్టుగా లెక్క తేల్చారు ఏపీ ఆర్థికశాఖ అధికారులు. కానీ.. ఇందులో కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు భారీగా కోతలు పెట్టారు. దాని ప్రకారం.. రూ.27,668 కోట్లకు మించి రుణాలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది.
రాష్ట్రానికి ఉన్న రుణ పరిమితి కన్నా అదనంగా గత సంవత్సరాల్లోనే అప్పులు తీసుకున్నట్టు కూడా కేంద్రం గుర్తించింది. ఈ మొత్తం 17,923 కోట్లుగా నిర్ధారించింది. ఇదేకాకుండా.. ఇతరత్రా అప్పులు మరో 6 వేల కోట్లు ఉన్నట్టు తేల్చింది. ఇవన్నీ లెక్కలోకి తీసుకొని కోతలు పెట్టింది కేంద్రం. దీంతో.. ఇప్పుడు రాష్ట్రం తీసుకోవడానికి అవకాశం ఉన్న అప్పు కేవలం 27,668 కోట్లు మాత్రమే.
అంతేకాదు.. రిజర్వు బ్యాంకు నుంచి ప్రతీవారం సేకరిస్తున్న 2 వేల కోట్ల బాండ్ల అప్పులను కూడా ఇక నుంచి ఇవ్వొద్దని ఆదేశాలు ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే భారీగా అప్పులు చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఈ కారణంగానే.. కేంద్ర పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ఆర్థిక మంత్రి ఢిల్లీలో మకాం వేసినట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ మంగళవారం ఎలాగైనా ఆర్బీఐ నుంచి అప్పు సేకరిస్తే.. బుధవారం నాటికి ఈ నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్ల సమస్య నుంచి బయటపడే అవకాశం ఉందని అంటున్నారు. మరి, ఈ సమస్య ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతుందో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి.