Secretariat Employees: ప్రభుత్వ కొలువు అని సంబరపడిపోయారు. సొంతూరులో ఉద్యోగం వచ్చిందని ఎగిరిగంతేశారు. రెండేళ్లలో పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగిగా మారిపోతామని కలలుకన్నారు. ఎన్నో అంచనాలు వేసుకున్నారు. కానీ అవన్నీ తలకిందులైపోయాయి.వారిని వదిలించుకునేలా ప్రభుత్వం వ్యవహరిస్తుండడంపై మదనపడుతున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పాలనను సులభతరం చేసేందుకు సచివాలయ వ్యవస్థను ప్రారంభించింది.
2019 అక్టోబరు 2న గాంధీ జయంతి నాడు సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. దాదాపు 19 శాఖలకు సంబంధించి కార్యదర్శులను ఏర్పాటుచేసింది. ఏపీపీఎస్సీ నేత్రుత్వంలో జిల్లా సెలక్షన్ కమిటీల ద్వారా సచివాలయ కార్యదర్శులను ఎంపిక చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల మందికిపైగా ఉద్యోగ భర్తీ చేసింది. నోటిఫికేషన్ సమయంలో రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్ పూర్తి చేసిన తరువాత రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తిస్తామని నోటిఫికేషన్ ఇచ్చింది. సరిగ్గా 2021 అక్టోబరు 2న వీరి రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్ పూర్తయిన తరువాత వీరికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రొబేషనరీ డిక్టరేషన్ కోసం విధిగా డిపార్ట్ మెంట్ పరీక్షలు రాయాల్సిందేనని స్పష్టం చేసింది. అందులోనూ కొన్ని కార్యదర్శుల పోస్టులకే పరీక్ష పెడుతున్నట్టు ప్రకటించింది. అటు తరువాత అందరికీ వర్తింపజేసింది. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో కఠినంగా పరీక్ష ప్రశ్నాపత్రం తయారు చేయడంతో చాలా మంది గట్టెక్కలేకపోయారు.
Also Read: Jagan Plan B: జగన్ ప్లాన్ ‘బీ’ రెడీ.. ‘మాజీ’లకు కూడా పదవులు..!
పోనీ పరీక్షలు అధిగమించిన వారికి ప్రొబేషనరీ డిక్లేర్ చేశారంటే అదీ లేదు. మరో ఆరు నెలల గడువు పెంచి 2022 జూన్ లో ప్రొబేషనరీ డిక్లేర్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు గడువు సమీపిస్తుండడంతో రోజుకు మూడు సార్లు హాజరు నిబంధననను తెరపైకి తెచ్చింది. మూడు పూటలా పనిచేసి విధిగా హాజరు వేస్తేనే ప్రొబేషనరీ డిక్లేర్ చేస్తామని చెబుతుండడంతో సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఇది పొమ్మన లేక పొగపెట్టే ప్రయత్నమేనంటూ సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అసలే ఆవేదనతో ఉన్న సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం యూనీఫారం తప్పనిసరి చేసింది. ఏ ప్రభుత్వ ఉద్యోగికీ ఈ నిబంధన వర్తింపజేయలేదు. కానీ అత్తెసరు జీతంతో, అభద్రతా భావంతో ఉన్న సచివాలయ ఉద్యొగుల విషయంలో మాత్రం ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వ ఉపాధ్యాయులకు యూనీఫారం ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. అందుకు సన్నాహాలు చేశారు. కానీ ఉపాధ్యాయుల నుంచి విముఖత రావడంతో నిర్ణయాన్ని మార్చుకున్నారు. సచివాలయ ఉద్యోగుల విషయంలో ఇదే వ్యతిరేకత వచ్చినా జగన్ సర్కారు వెనక్కి తగ్గలేదు.
మేమే నియమించామన్న భావనతో బలవంతంగా యూనిఫారం ధరణ చేయిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం అన్న భావనతో చాలా మంది సాఫ్ట్ వేర్, ఫార్మసీ రంగాల నుంచి లక్షలాది రూపాయల వేతనం వదులుకొని వచ్చారు. అటువంటి వారు ప్రభుత్వ నిర్ణయాలు చూసి హడలెత్తిపోతున్నారు. మంచి భవిష్యత్, లక్షలాది రూపాయల వేతనం వదులుకొని వచ్చిన తమకు తగిన శాస్తి కలిగిందంటున్నారు. ప్రభుత్వం ఇలానే వ్యవహరిస్తే ఉద్యమ బాటకు సన్నద్ధమవుతున్నారు. వేతనానికి మించి పనిచేస్తున్నామని.. ఇతర ప్రభుత్వ ఉద్యోగులు తమపై భారం పెట్టి చేతులు దులుపుకుంటున్నారని చెబుతున్నారు. వారిపై ఎటువంటి ఒత్తిడి పెంచకుండా.. తమపై భారం మోపడం తగునా అని ప్రశ్నిస్తున్నారు. పొమ్మన లేక పొగ పెట్టడంలో భాగంగానే రోజుకో జీవోతో ఇబ్బంది పెడుతున్నారని అనుమానిస్తున్నారు.