Uniform Secretariat Employees: మేము ఏమైనా చిన్న పిల్లలమా? విద్యార్థుల్లా కనిపిస్తున్నామా? ఉద్యోగులమని గుర్తున్నామా? కట్టుబానిసలుగా పరిగణిస్తున్నారా?…ఈ ప్రశ్నలు, ఆవేదనలు, ఆక్రోషాలు ఎవరికి అనుకుంటున్నారా? అదేనండీ మన గౌరవ ముఖ్యమంత్రి జగన్ మానస పుత్రులుగా భావిస్తున్న సచివాలయ ఉద్యోగులవి. ప్రజలు సచివాలయ ఉద్యోగులను సులభంగా గుర్తించేందుకు ప్రభుత్వం వారికి యూనిఫారం తప్పనిసరి చేసింది. ఉగాది నుంచి విధిగా ధరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. ప్రభుత్వ నిర్ణయంపై సచివాలయ ఉద్యోగులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అసలు తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థాయిలో ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు వైసీపీ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. 2019 అక్టోబరు 2 గాంధీ జయంతి నాడు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాలను ప్రారంభించింది. 19 శాఖలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 15,000 మంది సచివాలయ ఉద్యోగులను నియమించింది. జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ఆధ్వర్యంలో ఎంపిక చేసింది. గాంధీ జయంతి నాడు విధుల్లో చేరిన వీరికి రెండేళ్ల పాటు ప్రొబేషనరీ పీరియడ్ గా నిర్ణయించింది. ఈ లెక్కన 2021 అక్టోబరుతో వీరి ప్రొబేషనరి పీరియడ్ పూర్తయ్యంది. కానీ వీరిని రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించలేదు. పైగా ప్రొబేషనరీ డిక్టరేషన్ పరీక్షలంటూ కాలయాపన చేస్తూ వచ్చింది. మరో ఆరు నెలల పాటు ప్రొబేషనరీ పిరియడ్ ను పొడిగించింది. దీంతో అతి కష్టమ్మీద ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో వారికి స్వాంతన కలిగే నిర్ణయాలు తీసుకోవాల్సింది పోయి యూనిఫారం అంటూ ఒత్తిడి చేస్తున్నారు. యూనిఫారం ధరించని వారిపై శాఖ పరమైన చర్యలుంటాయని చెప్పడం ద్వారా బలవంతపు వస్త్రధారణ చేసేలా చేయడంపై ఉద్యోగుల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
Also Read: Rahul Gandhi Tweet On Paddy Procurement: రాహుల్ దయతో ఎట్టకేలకు టీఆర్ఎస్ తో ఫైట్ కు కాంగ్రెస్ రెడీ..
క్లాత్ అందించారు..కుట్టు కూలీ మరిచారు
ఇప్పటికే సచివాలయ ఉద్యోగులకు యూనిఫారానికి సంబంధించి మూడు జతల చొప్పున క్లాత్ అందించారు. పురుష ఉద్యోగులకు లైట్ బ్లూ కలర్ షర్ట్, క్రీమ్ కలర్ ఫ్యాంట్, మహిళా ఉద్యోగులకు లైట్ బ్లూకలర్ టాప్, క్రీమ్ కలర్ పైజామా, చున్నీ క్లాత్ లను అందించింది. కానీ కుట్టు కూలీ మాత్రం అందించ లేదు. సాధారణంగా గ్రామాల్లో ఒక్కో డ్రస్ కుట్టుకు రూ.600, పట్టణాల్లో రూ.800 వరకూ తీసుకుంటున్నారు. ఈ లెక్కన ఒక్కో ఉద్యోగికి కుట్టు కూలీకే రూ.2,000 దాటుతోంది. నెల జీతం చూస్తే రూ.15,000 ఇందులోనే కుటుంబ అవసరాలు, క్షేత్రస్థాయిలో సందర్శనలు, మండల కేంద్రాల్లో సమావేశాలు, బస్సు టిక్కెట్లు, బైకులకు పెట్రోల్ తదితర వాటికే రూ.10 వేలు ఖర్చు దాటుతోంది. ఈ సమయంలో యూనిఫారానికి చేతిలో డబ్బులు చెల్లించకోవాల్సి రావడంపై ఆవేదన చెందుతున్నారు. ప్రస్తతుం ప్రైవేటు ఉద్యోగికే రూ.20 వేలకు పైగా వేతనం అందుతోంది. అటువంటిది గత రెండున్నరేళ్లుగా అత్తెసరు జీతంతో నెట్టుకొస్తున్న తమపై ప్రభుత్వం కరుణ చూపకపోగా..కత్తి కట్టిందని వాపోతున్నారు.
కొలువు అనుకుంటే..కలత తప్పలేదు
వైసీపీ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగాలపై ప్రచార ఆర్భాటం ప్రచారం మూలంగా చాలా మంది విద్యాధికులు, ఇంజనీరింగ్, పోస్ట్ గ్రాడ్యూషన్, సాంకేతిక విద్య చదువుకున్న విద్యార్థులు మొగ్గుచూపారు. రెండేళ్ల లో ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడిపోతామని భావించారు. ప్రైవేటు పరిశ్రమల్లో మెరుగైన ప్యాకేజీ, జీతాలను వదులుకొని సచివాలయ ఉద్యోగులుగా చేరారు. కానీ ప్రొబేషనరీ డిక్లేర్ చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తూ వచ్చింది. దీంతో సచివాలయ ఉద్యోగులకు ఎదురుచూపులు తప్పడం లేదు. లక్షలాది రూపాయల వార్షిక వేతనం వదులుకొని వచ్చినందుకు తమకు తగిన శాస్తే జరిగిందంటున్నారు. పోనీ విధి నిర్వహణలో ప్రశాంతంగా ఉందంటే అదీ లేదు. కార్యాలయాల్లో వసతులు లేవు. ఉన్నతాధికారుల నుంచి వేధింపులు. స్థానిక నాయకుల నుంచి ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు నుంచి పన్నుల వసూల వరకూ అన్ని బాధ్యతలను వారికే అప్పగిస్తున్నారు. దీంతో అటు విధి నిర్వహణలో..ఇటు సరైన ఉద్యోగం దక్కలేదన్న బాధతో సతమతమవుతున్నారు.
Also Read: CM Jagan Gets Negative Review: జగన్ కు మరో అవకాశం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా లేరా?