
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పథకాల వరద నడుస్తూనే ఉంది. జగన్ అధికారం చేపట్టిన నుంచి అభివృద్ధి దిశగా నడుస్తున్నారు. ప్రజల కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూనే ఉన్నారు. ప్రతిపక్షాల నుంచి ప్రతిరోజూ పెద్దఎత్తున విమర్శలు వస్తున్నా వాటిని పెద్దగా లెక్కచేయకుండా తన పని తాను కానిచ్చేస్తున్నారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి సరికొత్త వ్యూహాలతో, సరికొత్త కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు.
ఇప్పటికే పల్లె సీమలే దేశానికి పట్టుకొమ్మలు అని నమ్మిన జగన్ సర్కార్ గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి, గ్రామాల ప్రజలకు ప్రభుత్వం అందించే పథకాలు, వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందేలా చూస్తోంది. ఇక ఇదే సమయంలో తాజాగా రాష్ట్రంలోని గ్రామాల పరిశుభ్రత లక్ష్యంగా జగన్ సర్కారు భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని గ్రామాలలో అన్నింటినీ స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలని సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వం ఇందులో భాగంగా పట్టణ ప్రాంతాల తరహాలో, గ్రామాలలో కూడా ఇళ్ల నుంచి చెత్త సేకరణతోపాటు, రోడ్లు ఊడ్చే పనుల నిర్వహణ ప్రాతినిథ్యం చేపట్టనుంది.
వంద రోజుల పాటు మిషన్ మోడ్‌గా దీనిని అమలు చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. వైఎస్సార్ జయంతి రోజైన జూలై 8వ తేదీన జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని సీఎం జగన్ భావిస్తున్నారు. గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడం కోసం ఏప్రిల్ 7 నుంచి అన్ని గ్రామాలలో సన్నాహక కార్యక్రమాలు మొదలు పెట్టనున్నారు. స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడంలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు.
వీధుల్లో చెత్తకుప్పలు లేని, చెత్తకుండీలే అవసరం లేని గ్రామాలుగా ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామాలను తీర్చిదిద్దనున్నారు. అంతేకాదు ఇళ్ల మధ్య నీటి గుంతలకు తావులేకుండా, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేలా, కుటుంబ ఆరోగ్య విషయంలో అవగాహన పెంచేలా రకరకాల కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు పెద్ద ఎత్తున ప్రచారం చేయనున్నారు. స్థానిక ప్రజలకు ఊరు పరిశుభ్రత బాధ్యతను అప్పగించనున్నారు. ఈ మేరకు పంచాయితీ రాజ్ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.