
‘వడ్డించే వాడు మనవాడు అయితే.. బంతిలో ఏ మూలకు కూర్చున్నా ఢోకా లేదు’ అనేది సామెత. ఇప్పుడు జగన్ ప్రభుత్వం తీరు కూడా అలాగే ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.. ఎలాగూ అధికారంలో ఉన్నాం కదా అని ఆయన సొంత మీడియాకు ప్రకటనల రూపంలో కోట్ల నిధులు ధారపోస్తున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయిన విజయ్ కుమార్ రెడ్డిని జగన్ ప్రమాణ స్వీకారం చేయగానే డిప్యుటేషన్‌పై తెచ్చుకున్నారు. ఆయన పదవి కాలం రెండేళ్లలో ముగుస్తున్న సమయంలోనే మరో మూడేళ్లకు పొడిగించారు. దీంతో ఆయన మరో మూడేళ్లు కొనసాగుతారు. ఈ క్రమంలో ఆయన నిబంధనలు అంటూ ఏమీ పట్టించుకోకుండా జగన్ సొంత మీడియాకు ప్రకటనల వరద పారిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సమాచారశాఖ కింద.. ఓ ప్రముఖ తెలుగు పత్రికకు 20 నెలల్లో రూ.వంద కోట్లకుపైగా ప్రకటనలు వెళ్లినట్లుగా తాజాగా వెలుగు చూసింది.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే మే 2019 నుండి ఈ ఏడాది జనరవరి వరకూ ఒక్క ఆ పత్రికకు ప్రభుత్వం తరపు నుంచి చెల్లించిన మొత్తం అక్షరాలా 104 కోట్ల 75 లక్షల రూపాయలు. ఇది ఒక్క పత్రికకు మాత్రమే. ఇక టీవీతోపాటు డిజిటల్ మీడియాకు కూడా ప్రకటనలు ఇచ్చారు. ఎలా చూసినా ఇరవై నెలల్లో 110 కోట్లు వరకూ ప్రజాధనం ఆ మీడియా ఖాతాలోకి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. సాధారణంగా పత్రికలకు ప్రకటనలు ఇవ్వడానికి కొన్ని నియమనిబంధనలు ఉంటాయి. వాటిని ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదు.
సర్క్యులేషన్ పరంగా రెండో స్థానంలో ఉన్న ఆ పత్రికకు అత్యధిక ప్రకటనలు ఇచ్చారు. వైసీపీకి మద్దతుగా వార్తలు రాసే చిన్నాచితకా పత్రికలకూ ప్రజాధనంతో ప్రకటనలు ఇచ్చారు. ఇసుకను ప్రైవేటుకు కట్టబెట్టడంపై వస్తున్న విమర్శలకు సమాధానాలకూ ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చారు. ఇలా చేయడం అధికార దుర్వినియోగం అవుతుందన్న ఆలోచన కూడా.. ప్రభుత్వ పెద్దలు చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇస్తున్న ఈ ప్రకటనలు.. చెల్లింపుల వల్ల భవిష్యత్‌లో అధికారులు ఇబ్బందులు పడతారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఈ సమాచారం అంతా ఒక్క సమాచార, ప్రసారశాఖల ద్వారా వెళ్లిన ప్రకటనలు మాత్రమే. ఇంకా వేర్వేరు శాఖల ద్వారా పెద్ద ఎత్తున ప్రకటనలు ఆ మీడియాకు వెళ్లాయి. అవి ఎంత భారీగా ఉంటాయో అంచనా వేయడం కష్టం. ప్రభుత్వం మారిన తర్వాత ఈ అక్రమాలన్నీ బయటకు తీయాలనుకునే ప్రభుత్వం వస్తే అప్పుడు అసలు ప్రజాధనం ఎంత మేర ఏ పత్రిక ఖాతాల్లోకి వెళ్లిందో స్పష్టమవుతుందని పలువురు అంటున్నారు.