ఎన్ని చట్టాలు తెచ్చినా మహిళలపై ఆకృత్యాలకు అడ్డుకట్ట పడడం లేదు. దీంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. మహిళలపై జరిగే నేరాలను నియంత్రించేందుకు కీలక చర్యలు చేపడుతోంది. ఆంధ్రప్రదేశ్ లో మహిళల భద్రతకు మరింత పకడ్బందీ చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు వేస్తోంది. తాజాగా సీతానగరంలో చోటుచేసుకున్నగ్యాంగ్ రేప్ ఘటనతో ప్రభుత్వం ఉలిక్కిపడింది.
దీంతో రాష్ర్టవ్యాప్తంగా సచివాలయాల్లో పని చేస్తున్న మహిళా సంరక్షణ కార్యదర్శి పోస్టును మహిళా పోలీస్ గా నామకరణం చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా సంరక్షణ కార్యదర్శుల్ని ప్రభుత్వం గతంలో నియమించింది. కానీ వారికి శిక్షణ, యూనిఫామ్ కానీ ఇవ్వకపోవడంతో వారి పోస్టు నామమాత్రంగా మారిపోయింది.
ఇప్పుడు సీతానగరం ఘటనతో మేల్కొన్న ప్రభుత్వం మరిన్ని సేవల్ని తెచ్చేందుకు ప్రణాళిక రచిస్తోంది. గతంలో నియమించిన మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీస్ గా పేరు మార్చింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే మహిళా సంరక్షణ కార్యదర్శుల్ని ఇకపై మహిళా పోలీసులుగా పిలుస్తారు.
వీరికి యూనిఫామ్ తోపాటు బాధ్యతలు అప్పగిస్తారు. మహిళలపై జరిగే ఆకృత్యాలకు సంబంధించి మహిళా పోలీసుల తరహాలోనే విధులు నిర్వహిస్తారు. ఈమేరకు సర్వీస్ రూల్స్ లో మార్పులు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. స్థానికంగా పోలీస్ స్టేషన్లకు అనుబంధంగా వీరు ఇకపై పని చేయాల్సి ఉంటుంది.