
ఏపీలో కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. పొరుగు రాష్ట్రం తెలంగాణలో తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతుంటే ఏపీలో మాత్రం 9,000కు అటూఇటుగా నమోదవుతున్న కేసులు ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. వైరస్ బారిన పడి కరోనా వారియర్స్ అయిన వైద్యులు, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది మృత్యువాత పడుతున్నారు.
కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు ఎక్కువగా రాష్ట్రంలో వైరస్ బారిన పడుతున్నారని తెలుస్తోంది. కొందరు వైరస్ బారిన పడి మృత్యువాత పడుతున్నారు. దీంతో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఎవరైనా వైరస్ బారిన పడి మృతి చెందితే 30 రోజుల్లో వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ నుంచి ఈ మేరకు ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఏ ఆస్పత్రిలో వైద్యుడు మరణించాడో ఆ ఆస్పత్రి సూపరిండెంట్ మృతి చెందిన వైద్యుడి వివరాలను వెంటనే పంపించాలని పేర్కొంది. వివరాలు అందిన వెంటనే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 10,621 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,93,090కు చేరగా 3633 మంది మృతి చెందారు. రాష్త్రంలో ప్రస్తుతం 94,209 యాక్టివ్ కేసులు ఉన్నాయి.