ఆంధ్రప్రదేశ్ లోని మోడల్ స్కూళ్లలో గెస్ట్ ఉపాధ్యాయుల సమస్యలు కోకొల్లలు. ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు కలిసినా ప్రయోజనం లేకుండా పోతోంది. వారికి చెల్లించాల్సిన బకాయిలు ప్రభుత్వం చెల్లించడం లేదు. కరోనా విపత్తు కారణంగా లాక్ డౌన్ సందర్భంలో వారందరూ ఉపాధి కోల్పోయినా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. ఉపాధి కోల్పోయి బకాయి వేతనాలు రాకపోవడంతో ఆత్మహత్యా యత్నానికి పాల్పడినా ఎవరు గుర్తించడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి వేదన అరణ్య రోదనగానే మిగులుతోంది. ప్రభుత్వం నిజంగా బకాయిలు చెల్లించలేని దుస్థితిలో ఉందా? సంక్షేమ పథకాల పేరుతో కోట్లాది రూపాయాలు ఖర్చుపెడుతన్న ప్రభుత్వానికి మోడల్ స్కూల్ టీచర్ల వెతలు కనిపించడం లేదా అని ప్రశ్ణిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఆదర్శ పాఠశాలలు విద్యాబోధనలో అత్యంత మెరుగైన ప్రమాణాలు చూపుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నాయి. మోడల్ స్కూళ్లలో బోధించడానికి అవసరమైన అధ్యాపకులు తగిన సంఖ్యలో లేకపోవడంతో గెస్ట్ టీచర్లను ప్రభుత్వం నియమించింది. కానీ వారి సమస్యలు తీర్చడంలో మాత్రం పట్టించుకోవడం లేదు. 2015 నుంచి మోడల్ స్కూళ్లలో గంటల లెక్కన పనిచేస్తున్న వారికి జీతాలు సైతం సరిగా ఇవ్వడం లేదు. పైగా రోజంతా వీరు స్కూళ్లలోనే ఉండాల్సి వస్తోంది.
రెగ్యులర్ టీచర్ల కంటే వీరికే పని ఎక్కువగా ఉంటోంది. దీంతో ఉద్యోగ భద్రత లేకపోయినా కొన్ని గంటలకే రికార్డు చేసి వాటికి మాత్రమే జీతాలు చెల్లిస్తుతండడంతో వీరి సమస్యలు తీరడం లేదు.2018 డిసెంబర్ లో చాలా మందిని ముందస్లు నోటీసులు లేకుండా ఉద్యోగం నుంచి తొలగించారు. 2019 మార్చిలో మరికొంతమందిని తీసేసింది.2020 మార్చి లాక్ డౌన్ తర్వాత గెస్ట్ టీచర్స్ గా నియమించినా తర్వాత ఉపాధి కరువైంది.
జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మోడల్ గెస్ట్ టీచర్లకు పలు హామీలు ఇచ్చారు. ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు. దీంతో వారు ఆశలు పెంచుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. గెస్ట్ టీచర్లను కాంటాక్టు పద్ధతిలోకి మారుస్తామని భరోసా కల్పించారు. కాంటాక్టు పద్ధతిలో నెలసరి వేతనం చెల్లిస్తామని పేర్కొన్నారని గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత వారి పరిస్థితిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
గెస్ట్ టీచర్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ను కలిసి తమ సమ్యలు తీర్చాలని విన్నవించారు. అయినా స్పందన రాలేదు. దీంతో ఆర్థిక శాఖ మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డిని కూడా కలిశారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా జగన్ అపాయింట్ మెంట్ కూడా దక్కకపోవడంతో నిరుత్సాహ పడ్డారు. ఏదో విధంగా జగన్ ను కలిసినా వారి సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఆయన ఇచ్చిన హామీలను గుర్తు చేసినా ఫలితం లేకుండా పోయింది.
పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు టీచర్లుగా తీసుకుని ఉద్యోగ భద్రత కల్పించాల్సి ఉన్నా ఆచరణలో కనిపించడం లేదు. కొవిడ్ విపత్తు పుణ్యమా అని ఉన్న ఉద్యోగాలు సైతం ఊడిపోయాయి. ప్రైవేటు సంస్థల ఉద్యోగులకు సైతం పలు రకాల ప్రయోజనాలు ఉన్నా ప్రభుత్వంలో పని చేసిన తమకు ఎలాంటి లాభం లేకుండా పోతోందని వాపోతున్నారు. ఇప్పటికే సంక్షేమం పేరిట కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం గెస్ట్ టీచర్ల పట్ల ఉదాసీనంగా వ్యవహరించడంపై మండిపడుతున్నారు.
గెస్ట్ టీచర్ల సమస్యలు తీర్చి వారికి రావాల్సిన బకాయిలు తక్షణమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించకుండా గిరిజన విద్యార్థుల కోసం ఏర్పాటు కానున్న ఏకలవ్య మోడల్ స్కూళ్లలో నియామకాల్లో ఇది వరకు గెస్ట్ టీచర్ గా పని చేసిన వీరికి కొంత వెయిటేజీ ఇవ్వాలని కోరుతున్నారు. తమ పనికి రావాల్సిన వేతనాలు సకాలంలో చెల్లించి ఆదుకోవాలని పేర్కొన్నారు. జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ నిలబెట్టుకునేందుకు పాటుపడాలని అభిప్రాయపడుతున్నారు.