
ప్రజాప్రతినిధులపై ఉన్న క్రిమినల్ కేసులను ఏక పక్షంగా ఎత్తేయడం సాధ్యం కాదని, ఇందుకు హైకోర్టు అనుమతి ఉండాల్సిందేనని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ తీర్పు వచ్చి మూడు రోజులు కూడా కాలేదు. అయినా.. ఏపీ సర్కారు తన పని తాను చేసుకుపోయింది. సుప్రీం ఆదేశాలను లెక్క చేయకుండా వైసీపీ ఎమ్మెల్యేపై ఉన్న క్రిమినల్ కేసును ఎత్తేసింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీచేయడం గమనార్హం.
టీడీపీ ప్రభుత్వంలో సోమిరెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో.. ఆయనపై ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సోమిరెడ్డికి విదేశాల్లో వెయ్యి కోట్ల ఆస్తులు ఉన్నాయని ప్రెస్ మీట్ పెట్టి ఆరోపించారు. అంతేకాదు.. కొన్ని పత్రాలను కూడా మీడియాకు విడుదల చేశారు. దీనిపై సోమిరెడ్డి పోలీసులను ఆశ్రయించారు. అయితే.. పోలీసు విచారణలో ఆ పత్రాలు నకిలీవని తేలిపోయింది. దీంతో.. కాకాణి గోవర్ధన్ రెడ్డితోపాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. అయితే.. ఇప్పుడు ఆ కేసును ఎత్తేస్తూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ కేసులో బాధితుడిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజీకి సిద్ధంగా లేరు. దోషులకు శిక్ష పడాలనే ఆయన కోరుకుంటున్నారు. మరి, ఏపీ సర్కారు ఏ విధంగా ఈ కేసును ఎత్తేస్తుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ఇప్పటికే జగన్ తోపాటు పలువురు ఎమ్మెల్యేలపై ఉన్న సుమారు 40కి పైగా కేసులను ఏపీ సర్కారు ఎత్తేసింది. దీనిపై హైకోర్టు సుమోటోగా విచారణ కూడా చేపట్టింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతూనే ఉంది. అయినా.. ఏపీ సర్కారు మరో కేసు ఎత్తేస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. సుప్రీం కోర్టు ఆదేశించిన తర్వాత కూడా జగన్ ప్రభుత్వం ఇలా వ్యవహరించడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. న్యాయవ్యవస్థను పట్టించుకోని సర్కారు తీరు మరోసారి నిరూపితమైందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.