AP Govt- Lottery Tickets: ప్రభుత్వ నుంచి ఆదేశాలు లేకుండా అధికారులు ఏ పనిచేయరు. అటువంటిది జూదంతో సమానమైన లాటరీ టిక్కెట్లు విక్రయించడానికి సిద్ధపడ్డారంటే దానిని ఏమనుకోవాలి. వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే లాటరీ టిక్కెట్ల విక్రయానికి సిద్ధమైంది. లాటరీ విధానం అమల్లో ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక అధికారుల బృందాన్ని పంపి మరీ స్టడీ చేసింది. కానీ ఎందుకో అది అప్పట్లో వర్కవుట్ కాలేదు. ప్రజల నుంచి విమర్శలొస్తాయనో.. లేక ఇతరత్రా కారణాలో తెలియదు కానీ ప్రభుత్వం సైలెంట్ అయ్యింది. ఉన్నట్టుండి ఇప్పుడు రవాణా శాఖ అధికారులు లక్కీ డ్రా రూపంలో లాటరీ టిక్కెట్లు విక్రయించేందుకు సిద్ధపడ్డారు. ఇందుకు విజయనగరం జిల్లాను ట్రయల్ రన్ కోసం ఎంచుకున్నారు. రూ.100 టిక్కెట్ కొంటే.. లక్కీ డ్రాలో బైక్ గెలుచుకోవచ్చని ప్రకటించారు. వలంటీర్లతో టిక్కెట్లు విక్రయించేలా ప్లాన్ చేశారు. ముచ్చటగా రూ.3 లక్షలు పెట్టి మూడు బైకులు కొనుగోలుచేసి.. ఎంచక్కా కోట్ల రూపాయల ఆదాయానికి రవాణా శాఖ అధికారులు ప్లాన్ చేశారు.

ప్రస్తుతం విజయనగర్ ఉత్సవ్, తరువాత పైడితల్లి అమ్మవారి పండుగ కావడంతో ఇంతకంటే మంచి తరుణం ఉంటుందా అని భావించి టిక్కెట్ల అమ్మకానికి తెరతీశారు. అయితే దీనిపై ప్రజల నుంచి విముఖత వ్యక్తమైంది. ఆదాయం కోసం ప్రభుత్వం ఇంతలా దిగజారుతుందా? అన్న అనుమానాలు వ్యక్తం చేశారు. సహజంగానే ఇటువంటి పనుల్లో ముందుండే జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణపై అందరూ అనుమానపు చూపులు చూశారు. దీంతో పరిస్థితిని గమనించిన బొత్స ఇదేదో మెడకు చుట్టుకుంటుందని భావించారు. అసలుకే ఎసరు వస్తుందని ఊహించి అధికారులకు మందలించినట్టు మీడియాకు లీకులిచ్చారు. అయితే రవాణా శాఖ అధికారులు ఉత్త పుణ్యానికే ఇటువంటి వాటికి దిగుతారా? ప్రభుత్వ పెద్దల ఆదేశాలు లేనిదే ప్రస్తుతం చీమ కూడా కుట్టదు. అటువంటిది జూదానికి దగ్గరగా ఉన్న లక్కీడ్రా టిక్కెట్ల వ్యవహారానికి రవాణా శాఖ అధికారులు దిగారంటే నమ్మశక్యంగా లేదు.

ఇప్పటికే మద్యం షాపులను పెంచేశారు. కొత్త కొత్త బ్రాండ్లు తెచ్చి విక్రయిస్తున్నారు. రూ.6 వేల కోట్ల మద్యం ఆదాయాన్ని రూ.25 వేల కోట్లకు పెంచేశారు. పన్నుల ద్వారా బాదేస్తున్నారు. చివరకు చేపలు, మాంసం విక్రయిస్తున్నారు. ఈ ఆదాయమంతా చాలదన్నట్టు ఇప్పుడు లాటరీ టిక్కెట్లు విక్రయించి సొమ్ము చేసుకోవాలని భావిస్తున్నారు. అటు ఏపీని అప్పులకుప్పగా మారుస్తూ.. ఇటు జూద క్రీడకు కూడా తెరలేపుతున్నారు. ఇలానే కొనసాగితే పేకాట క్లబ్ లను తెరిచినా ఆశ్చర్యపోనవసరం లేదని ప్రజలు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికైతే లాటరీ టిక్కెట్ల విక్రయంపై ఆదిలోనే హంసపాదు పడింది. విజయనగరంలో ట్రయల్ రన్ బెడిసికొట్టింది.