
AP Drugs Scam: ఓ వైపు డ్రగ్స్ కేసు సినీ ఇండస్ట్రీని నిద్రలేకుండా చేస్తోంది. విచారణ కోసం రోజుకో నటుడు ఈడీ పోలీసుల వద్దకు వెళ్తున్నాడు. ఇదే సమయంలో అప్ఘనిస్తాన్ నుంచి భారీస్థాయిలో రవాణా అవుతున్న హెరాయిన్ ను గుజరాత్ లో పట్టుకున్నారు. దాదాపు 15 వేల కోట్ల రూపాయల విలువ ఉన్న దీని వెనక పెద్ద తలకాలయలే ఉన్నారని భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ కేసులో ఏపీకి చెందిన వారి హస్తం కూడా ఉండడం సంచలనమైంది. ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. వీరిలో ఏపీకి చెందిన సుధాకర్ ఆయన భార్య వైశాలి కూడా ఉన్నారు. ఇప్పటి వరకు అందరిమధ్య ఉన్న సుధాకర్, వైశాలి లకు పెద్ద స్థాయిలో డ్రగ్స్ ముఠాతో సంబంధాలున్నాయని తెలియడంతో ఏపీలో కలకలం రేపింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వీరి గురించి తీవ్ర చర్చ మొదలైంది.
తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడికి చెందిన సుధాకర్… అక్కడి వారికి విశాఖలో ఉంటున్నారని మాత్రమే తెలుసు. సుధాకర్ భార్య వైశాలితో కలిసి నివసిస్తున్నారు. సుధాకర్ సోదరుడు ఓ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. తల్లి వృద్ధాప్య పింఛన్ తీసుకుంటోంది. విశాఖలోని ఓ సిమెంట్ కంపెనీలో ఆయన లాజిస్టిక్ మేనేజర్ గా పనిచేసేవాడు. అయితే షార్ట్ కర్ట్ గా డబ్బు సంపాదించాలంటే పెద్ద ఎత్తున బిజినెస్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా ఆయన కొందరు ముఠాలతో సంబంధాలు ఏర్పరురుకున్నాడు. ఈ క్రమంలో ఆయనకు డ్రగ్స్ మాఫియాతో పరిచయాలు ఏర్పడ్డాయి. దీంతో ఆషీ ట్రేడింగ్ కంపెనీ పేరుతో ఓ లైసెన్స్ తీసుకున్నట్లు సమాచారం. ఆ తరువాత ఈ కంపెనీకి జీఎస్టీ, ఐఈఎస్ సర్టిఫికెట్లను కూడా తయారు చేశాడు. జీఎస్టీ సర్టిఫికెట్లో బియ్యం, పండ్లు ఇతర వస్తువులను ట్రేడింగ్ చేస్తున్నట్లు ప్రభుత్వాన్ని నమ్మించాడు. డేంజరస్ అండ్ అఫెన్సివ్ ట్రేడ్ లైసెన్స్ (డీఅండ్ఓ) తీసుకోలేదు.
ఆషీ కంపెనీ ట్రేడింగ్ కు విజయవాడలో కూడా బ్రాంచ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇక్కడ మాత్రం ఇంపోర్ట్ అండ్ ఎక్స్ పోర్ట్స్ సర్టిఫికెట్ (ఐఈసీ) కూడా తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. నాలుగు రోజుల కిందట హఠాత్తుగా ఈ బ్రాంచ్ వద్దకు పోలీసులు వచ్చి తనిఖీ చేయడంతో స్థానికులు కంగు తిన్నారు. భారీ ఎత్తున పట్టుబడిన హెరాయిన్ విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు జరిగినట్లు నిర్దారణ కావడంతో స్థానికులు ఇంకా షాక్ నుంచి కోలుకోవడం లేదు.
అప్ఘనిస్తాన్ నుంచి ఇంత పెద్ద మొత్తంలో హెరాయిన్ రవాణా కావడంతో ఇందులో టెర్రరిస్టుల పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కంటెయినర్ల ద్వారా ఓడరేవులకు చేర్చి, అక్కడి నుంచి ఢిల్లీకి చేర్చాలన్న లక్ష్యంతో ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఈ రవాణాకు తాలిబన్, పాకిస్తాన్ ఐఎస్ఐ వారి సహకారం కూడా ఉందని అనుమానిస్తున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా డీఆర్ఐ బృందాలు చెన్నై, అహ్మదాబాద్, హైదరాబాద్ ఢిల్లీలో విచారణ చేపట్టాయి.
ఇదిలా ఉండగా హెరాయిన్ తో ఏపీకి సంబంధం ఉందన్న విషయం బయటికి రావడంతో రాజకీయంగా దుమారం లేచింది. అధికార పార్టీ వైసీపీ అండతోనే ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ మాఫియా సాగుతోందని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. దేశంలో ఎక్కడా స్కాం జరిగినా ఏపీతో సంబంధాలున్నాయని అంటున్నారు. దేశంలోనే అతిపెద్ద హెరాయిన్ పట్టుబడిన కేసులో ఏపీ మూలాలు ఉండడం ఆందోళనకరమని ఆరోపిస్తున్నారు.
అయితే ఈ విమర్శలను అధికార పార్టీ నాయకులు తిప్పి కొడుతున్నారు. టీడీపీ నేతలను ప్రతీ విషయంలో విమర్శలు చేయడం అలవాటుగా మారిందని అంటున్నారు. పూర్తి వివరాలు వెల్లడించకుండానే ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికావంటున్నారు. ఇలాంటి విమర్శలు చేసేముందు ఆలోచించుకోవాలని అంటున్నారు.