
సమాచార, ప్రసార మధ్యమాల నియంత్రణ చట్ట పరిధిలో ఉండాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈ మధ్య కాలంలో మీడియా (ఎలక్ట్రానిక్, ప్రింట్ మరియూ సోషల్ మీడియా) లో నియంత్రణ లేకుండా రెచ్చ గొట్టే విధంగా ప్రచురిస్తున్న వార్తలు, వ్యాఖ్యల వల్ల సమాజంలో అలజడి రేగుతోందన్నారు. పరిస్థితులు వ్యక్తిగత దూషణల నుండి మొదలై వైషమ్యాల వైపునకు దారితీస్తున్నాయని చెప్పారు. ఫలితంగా అశాంతి వాతావరణాన్ని ప్రేరేపిస్తున్నాయని, ఇలాంటి పరిణామాలు సమాజానికీ, వ్యవస్థకూ మంచిదికాదని తెలిపారు. ఇట్టి పోకడలను అరికట్టే క్రమంలో పోలీసు శాఖ ఈ మధ్య కాలంలో శాఖా పరమైన వ్యవస్థ లను పటిష్టం చేసుకుంటోందన్నారు. సీఐడీ విభాగంలోని సైబర్ క్రై మ్ వింగ్ లో సోషల్ మీడియా నేరాల నియంత్రణ, పర్యవేక్షణకు ప్రత్యేకంగా మరో వింగ్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటికే పలు ఫిర్యాదులు రావడం, వాటి దర్యాప్తు వేగవంతం చేయడం జరుగుతుందన్నారు.
అదే విధంగా మాధ్యమాలలో రాజ్యాంగ బద్ద సంస్థల పట్ల మరియు ఆ సంస్థల నిర్వహణలో ఉన్న వ్యక్తుల పట్ల వ్యాఖ్యలు చేయడం, వాటిని ఇష్టం వచ్చినట్టు అన్వయించుకోవడం సరికాదని స్పష్టం చేశారు. ప్రచురించే, ప్రసారం చేసే సమాచారంలో, అభిప్రాయాల వ్యక్తీకరణలో చట్టాలను అనుసరించాలన్నారు. వక్రీకరణ, లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా ఇవ్వడం, ఊహాజనిత అంశాలను ప్రసారంచేయడం, ప్రచురించడం, అశ్లీల, అసభ్యకర, నిందపూర్వక, అభ్యంతరకర వ్యాఖ్యానాలు చేయడం గర్హనీయమని తెలిపారు. ఈ విషయంలో చట్ట ప్రకారం వ్యవహరిస్తామని పునరుద్ఘాటించారు. పోలీసు శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి వ్యక్తులను ఉపేక్షించేది లేదన్నారు. ఇటీవల గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పట్ల, వారి తీర్పుల పట్ల కొందరు చట్టాన్ని అతిక్రమించి వ్యాఖ్యలు చేశారన్న విషయంలో హైకోర్ట్ ఇచ్చిన ఫిర్యాదు పై దర్యాప్తు వేగవంతం చేసాం. అలాగే ప్రభుత్వం మీద, ప్రభుత్వంలోని ప్రముఖ వ్యక్తుల మీద కూడా తప్పుడు ప్రచారాలు, అవాస్తవాలు ప్రచారం చేసి ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్ననిస్తున్నారని వీరిపైనా దృష్టి పెట్టినట్లు చెప్పారు.
మనం పరిణిత చెందిన సమాజంలో ఉన్నామనే విషయాన్ని అందరూ గుర్తించాలని, ప్రజాస్వామ్య యుతంగా, రాజ్యాంగ పరంగా ఏర్పడ్డ సంస్థల గౌరవానికి, వ్యవస్థల గౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తించరాదని మరోసారి హెచ్చరించారు. ప్రింట్‌మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచురుణలు, ప్రసారాలు చేసేవారు, అభిప్రాయలు వ్యక్తీకరించేవారు నియంత్రణ పాటించక పోతే అట్టి వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.