CM Jagan: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వాడుక భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తించుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవం గా జరుపుకోవడం గర్వకారణంగా పేర్కొన్నారు. తెలుగు సాహిత్యాన్ని తెలుగు భాష తియ్యదనాన్ని సామాన్యుడికి చేర్చిన ఘనత ఆయనకే సొంతమని కొనియాడారు. మంగళవారం ట్విట్టర్ లో ట్విట్ చేశారు
తెలుగు భాషా వికాసానికి గిడుగు రామ్మూర్తి అందించిన సేవలు మర్చిపోలేనివి. తెలుగు భాషలో గ్రాంథిక వాదాన్ని తొలగించి.. వ్యవహారిక వాదానికి శ్రీకారం చుట్టిన మహా మేధావి ఆయన. 1863 ఆగస్టు 29న జన్మించారు. చరిత్ర విభాగంలో అధ్యాపకుడిగా పనిచేశారు. సంప్రదాయక విద్య కంటే ఆధునిక విద్యలో విశాల దృష్టి అవసరం అని చెప్పారు. తెలుగు భాషా నిఘంటువులు, గద్య చింతామణి, నిజమైన సంప్రదాయం, వ్యాసా వలి వంటి గ్రంథాలను ఆయన రాశారు. ఈ తెలుగు భాష విస్తృతి పెరగడానికి ఎంతో సహాయపడ్డాయి. 1919లోనే మొట్టమొదటి తెలుగు వ్యవహారిక భాషా పత్రికను గిడుగు రామ్మూర్తి స్థాపించారు. కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు వంటి సాహితీవేత్తలతో కలిసి అదే ఏడాది ఆంధ్రభాష ప్రవర్తక సమాజాన్ని స్థాపించారు. తెలుగు భాషను గ్రాంధికం నుంచి వాడుక భాషగా మార్చిన ఘనత మాత్రం గిడుగు రామ్మూర్తి పంతులకే దక్కుతుంది. అందుకే ఆయన జయంతి నాడు తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
గిడుగు రామ్మూర్తి పంతులు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఆయన జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. భాషలోనే అందాన్ని, విసులుబాటును లోకానికి అందజేసిన ఘనత గిడుగు రామ్మూర్తి పంతులుకే సాధ్యమని సీఎం స్పష్టం చేశారు.