
ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా.. ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నా.. కార్యనిర్వాహక వ్యవస్థ వాటిని పక్కాగా అమలు చేయాలి. సీఎస్ నుంచి మొదలు.. గ్రామీణ క్షేత్రస్థాయి వరకు ఉన్న అధికారులు సరిగ్గా పనిచేస్తేనే.. జనానికి వాటి ఫలాలు పూర్తి అందుతాయి. ఇక, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటన్నది కూడా అధికారులకే బాగా తెలుస్తుంది. జనం ఇబ్బందులను అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం.. సర్కారు వాటిని పరిష్కరించడం.. జరుగుతుంది. ఇదంతా ఒక చట్రం.
అందుకే.. కొందరు ముఖ్యమంత్రులు ఆఫీసర్ల అభిప్రాయానికే ప్రాధాన్యత ఇస్తారు. ప్రజాప్రతినిధులు వారి అవసరాలకోసమో.. ముఖస్తుతి కోసమో.. భజన చేయడానికే చూస్తారు. అంతా బ్రహ్మాండం అని చెబుతుంటారు. ఈ విషయం తెలిసే.. కొందరు సీఎంలు అధికారుల నుంచి ప్రజాభిప్రాయాన్ని తెప్పించుకుంటారు. ఇప్పుడు జగన్ కూడా అధికారులకే ప్రయారిటీ ఇస్తున్నారనే అభిప్రాయం ఉంది. అయితే.. ఇటీవల ఈ అధికారుల నుంచి ముఖ్యమంత్రికి రాంగ్ ఫీడ్ బ్యాక్ వెళ్లిందనే ప్రచారం సాగుతోంది.
రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. తోటిరాష్ట్రం తెలంగాణలో కన్నా.. రెండింతల కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. అవుతూనే ఉన్నాయి. ఇక, ఆక్సీజన్ కొరతతో పలుచోట్ల బాధితులు చనిపోయిన సంగతి కూడా తెలిసిందే. అయితే.. పరిస్థితి ఇంత తీవ్రం కాకముందే ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షల్లో.. అంతా భేషుగ్గానే ఉందని ఫీడ్ బ్యాక్ ఇచ్చారట అధికారులు. ఆక్సీజన్ నిల్వలకు ఢోకా లేదని.. ధైర్యంగా ఉండొచ్చని కూడా చెప్పేవారట. అయితే.. అసలు నిజం ఏంటన్నది చాలా మంది ప్రాణాలు పోయిన తర్వాతగానీ అర్థం కాలేదని అంటున్నారు.
దీంతో.. అధికారుల ఫీడ్ బ్యాక్ పైనా పూర్తిగా డిపెండ్ కావడానికి లేదని ముఖ్యమంత్రికి అర్థమైందని అంటున్నారు. కేవలం అధికారుల ఫీడ్ బ్యాక్ మీదనే కాకుండా.. ఇటు ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని అనుకుంటున్నారట. గతంలో చంద్రబాబు దెబ్బతినడానికి ఇలాంటి రాంగ్ పీడ్ బ్యాక్ కూడా కారణమని చెబుతుంటారు. ఇప్పుడు జగన్ కు సైతం ఇలాంటి పరిస్థితి ఎదురు కావడంతో.. మున్ముందు ఎలా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది.