
కేంద్ర ప్రభుత్వానికి జగన్ భయపడతారని తెలుసు. కానీ ధిక్కార స్వరం వినిపిస్తారని ఎవరూ ఊహించరు. ఇన్నాళ్లు ప్రధాని మోదీకి వంతపాడిన ఏపీ సీఎం జగన్ ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించారు. అందరు ముఖ్యమంత్రులకు లేఖలు రాసి తనలోని ఆవేశాన్ని వెల్లగక్కారు. ప్రధాని విధేయుడిగా ముద్రపడిన జగన్ ఇప్పుడు ఆయనతో విభేదించారు.కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పు పడుతున్నారు. వ్యాక్సినేషన్ విషయంలో ప్రభుత్వ చర్యలతో రాష్ర్టాలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి అందరు ముఖ్యమంత్రులు ఏకం కావాలని పిలుపునిచ్చారు.
గ్లోబల్ టెండర్ల విధానంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. రాష్ర్టాల్లో వ్యాక్సినేషన్ లభ్యతలో తలెత్తుతున్న ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రులంతా ఒకే గొంతుకై వినిపించాలని జగన్ కోరారు. దేశంలోని అన్ని రాష్ర్టాల సీఎంలకు లేఖలు రాయడాన్ని మామూలుగా తీసుకోవద్దని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ లో కలిగిన ధిక్కార స్వభావానికి కేంద్రం ఏ మేరకు స్పందిస్తుందో చూడాలి.
కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలనే ఆశయంతో విదేశాల నుంచి టీకాలు తెప్పించే క్రమంలో గ్లోబల్ టెండర్లకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ సర్కారు కూడా ఇదే పద్ధతి అనుసరించింది. అయితే రాష్ర్టాలకు ప్రత్యేకంగా టీకా సరఫరా చేసేది లేదని, కేంద్రమే అందజేస్తుందని తెలిపింది. దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆలస్యం అవుతోంది. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి తాము మూల్యం చెల్లించాల్సి వస్తుందని సీఎంలు వాపోతున్నారు.
వ్యాక్సిన్ విషయంల జగన్ ముందుకు రావడంతో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు కేంద్ర ప్రభుత్వానికి సహకరించిన జగన్ ఒక్కసారిగా స్వరం పెంచడంతో ఖంగు తిన్నారు. జగన్ లో వస్తున్న మార్పులను కేంద్రం పరిశీలిస్తోంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం సాగుతోంది.