కొవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో కొందరు ముఖ్యమంత్రులతో ఫోన్లో మాట్లాడారు మోడీ. ఇదే సందర్భంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ తోనూ ప్రధాని మాట్లాడారు. మోడీతో మాట్లాడిన తర్వాత హేమంత్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.
‘గౌరవనీయ ప్రధానమంత్రి ఫోన్ చేసి మాట్లాడారు. ఆయన తన ‘మన్ కీ బాత్’ మాత్రమే చెప్పారు. కొద్దిగా ఉపయోగపడే విషయాలు చెప్పి, మేం చెప్పేది కూడా వింటే బాగుండేది.’ అని రాశారు. ఇందులో జగన్ కు ఏం తప్పు కనిపించిందో తెలియదు.. వెంటనే స్పందించారు ఏపీ సీఎం.
‘‘మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. ఒక సోదరుడిగా చెబుతున్నాను. మన మధ్య ఎలాంటి విభేదాలైనా ఉండొచ్చు. కానీ.. ఇలాంటి రాజకీయాలు మన సొంత దేశాన్ని బలహీనపరుస్తాయి. ఇది కొవిడ్ పై యుద్ధం చేస్తున్న సమయం. ఇలాంటప్పుడు ఒకరిని వేలెత్తి చూపించే బదులు.. మనమంతా కలిసి సమర్థంగా యుద్ధం సాగించేలా ప్రధానమంత్రిని బలోపేతం చేయాలి’’ అని హేమంత్ కు సుచిస్తూ రాసుకొచ్చారు.
దీనిపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ కేంద్రానికి లొంగిపోయారని మండిపడుతున్నారు నెటిజన్లు. కేంద్రం నిర్లక్ష్యం వల్లే కొవిడ్ బీభత్సంగా పెరిగిపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. జగన్ మోడీకి మద్దతుగా మాట్లాడడం చర్చనీయాంశమైంది. కేవలం సీబీఐ భయంతోనే ఆయన ఇలా చేశారని ఎగతాళి చేస్తున్నారు.